Advertisement

షిమ్లాలోని 'బుక్ కేఫ్'

By: chandrasekar Wed, 15 July 2020 8:30 PM

షిమ్లాలోని 'బుక్ కేఫ్'


పర్వత ప్రాంతంలో చల్లని వాతావరణంలో వేడి వేడి కప్పు కాఫీను ఆస్వాదిస్తూ ఆసక్తికరమైన పుస్తకాన్ని చదవడం ఒక ప్రత్యేకమైన అనుభవం అని చెప్పవచ్చు. అలాంటి ఓ ప్రదేశం గురించే మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారు. ఇక్కడ పని చేసే వారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ కేఫ్ లో పని చేసేది సాధారణ వ్యక్తులు కాదు జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు. అవును మీరు చదివింది నిజమే. ఖైదీలే ఇక్కడ కస్టమర్లకు సర్వీస్ చేస్తారు. పైన చెప్పిన అనుభవాన్ని మీరు కోరుకుంటే షిమ్లా వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఈ కేఫ్ ను సందర్శించండి. దీనిని షిమ్లాలోని ఒక కొండపై ఏర్పాటు చేశారు.

'బుక్ కేఫ్' అనే పేరుతో ఏర్పాటైన ఈ కేఫ్ షిమ్లాలోని ప్రత్యేకమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ కాఫీతో పాటు ఎన్నో రకాల స్నాక్స్, రుచికరమైన పానీయాలు, చుట్టూ అద్భుతమైన పర్వతాల దృశ్యాలను కూడా పొందవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ కేఫ్ లో రోజు వారీ కార్యకలాపాలను షిమ్లా సమీపంలోని కైతు జైల్ లో ఉన్న నలుగురు జీవిత కాల ఖైదీలు నడిపించడం విశేషం. కేఫ్ పేరుకు తగిన విధంగానే ఇందులో ఒక మినీ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మీరు నచ్చిన పుస్తకాన్ని ఎంపిక చేసుకుని హాయిగా కేఫ్ లో సేదతీరుతూ స్నాక్స్ తింటూ చదువుకోవచ్చు.

ఖైదీల పునరావాసం కోసం ఒక గొప్ప చొరవగా పని చేస్తున్న ఈ కేఫ్ కు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధులు సమకూర్చింది. ఈ కేఫ్ లో మొత్తం 40 మంది కూర్చునేందుకు అవకాశం ఉంది. బుక్ కేఫ్ ను ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 9 గంటలకు మూసివేస్తారు.

జై చంద్, యోగ్ రాజ్, రామ్ లాల్ మరియు రాజ్ కుమార్ అనే ఖైదీలు ఈ కేఫ్ లో పని చేసేందుకు ఒక ప్రఖ్యాత హోటల్ ద్వారా అధికారికంగా శిక్షణ పొందారు. తద్వారా వారు వినియోగదారులకు సరైన పద్ధతిలో సేవలు అందించగలుగుతున్నారు. ప్రపంచానికి తమ మంచితనాన్ని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చినందుకు ఈ నలుగురు ఖైదీలు ఎంతో సంతోషంగా ఉన్నారు.

జై చంద్ అనే ఖైదీ మీడియాతో మాట్లాడుతూ ఈ కేఫ్ తమకు ప్రపంచంతో అనుసంధానమయ్యే అవకాశాన్ని కల్పించిందని అన్నారు. దీనిని మేము నలుగురం స్వతంత్రంగా నడుపుతున్నాం. సందర్శకులు, స్థానికులు కూడా మాతో సంభాషించేటప్పుడు ఎలాంటి ఆందోళన పడరు. అంతే కాదు వారు మాకు సంబంధించిన విషయాలను, మాలో మార్పు గురించి తెలుసుకునేందుకు మరింత ఆసక్తి చూపిస్తారని ఖైదీలు చెబుతుంటారు.

పిజ్జాలు, కుకీలు, శాండ్ విజ్ లు, ఇతర ఆహారాలతో సహ అనేక రకాల పానీయాలు మరియు అల్పాహారాలను ఇక్కడ అందిస్తారు. అంతే కాదు సందర్శకులకు ఈ కేఫ్ లో ఉచిత వైఫై సదుపాయం కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రసిద్ధ రచయితల ఆసక్తికరమైన పుస్తకాల సేకరణను, వార్తా పత్రికలను ఇక్కడ చూడవచ్చు.

Tags :
|
|
|
|

Advertisement