Advertisement

లెటర్‌ రాస్తే చాలు కష్టాలను గట్టెక్కించే త్రినేత్ర గణేశుడు

By: Dimple Thu, 27 Aug 2020 00:48 AM

లెటర్‌ రాస్తే చాలు కష్టాలను గట్టెక్కించే త్రినేత్ర గణేశుడు

కష్టం వచ్చినపుడు దేవుణ్ణి తలచుకుంటాం.... ఆపదలోంచి గట్టెక్కించమని కోరుకుంటాం... దైవదర్శనం చేసుకుని మొక్కును చెల్లించుకుంటాం... భారతదేశంలో త్రినేత్రుడిగా వెలసిన వినాయకుడికి కష్టాలను, పడే బాధలను ఏ భాషలోనైనా రాసి ఉత్తరం పంపితే చాలు... కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతకీ ఆ గుడి ఎక్కడుందో ఇపుడు తెలుసుకుందాం..!

రాజస్థాన్‌లోని రణథంబోర్​ కోటలో ఉన్న ఈ మహాకాయుడి ఆలయం చాలా పురాతనమైనది. 10వ శతాబ్దంలో సవాయ్‌ మధోపూర్‌కి దాదాపు 12 కి.మీల దూరంలో మహారాజా హమ్మిరదేవ దీన్ని రణథంబోర్‌ కోటలో నిర్మించారు. అల్లాఉద్దీన్​ ఖిల్జీతో యుద్ధం జరుగుతున్న సమయంలో వినాయకుడు రాజుగారి కలలోకి వచ్చి ఖిల్జీపై విజయం సాధించేందుకు సాయం చేశాడని.. దాంతో రాజు తన కోటలోనే త్రినేత్ర వినాయకుడి ఆలయం నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

కోట చుట్టూ ఆరావళి, వింధ్యాచల్‌ పర్వతాలు ఉన్నాయి. భూభాగం నుంచి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఈ త్రినేత్ర విఘ్నేశ్వరుడి ఆలయంలో ఒక్క లంబోధరుడే కాదు.. ఆయన కుటంబం మొత్తాన్ని దర్శించుకోవచ్చు. విఘ్నేశ్వరుడి భార్యలు రిద్ది, సిద్ధి, కుమారులు శుభ్‌, లాభ్‌ ఒకే ఆలయంలో వెలిశారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నప్పుడు పొరపాటున వినాయకుడిని పిలవడం మరిచిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అనేక సవాళ్లు ఎదర్కోవాల్సి వచ్చిందని.. ఆ తర్వాత శ్రీకృష్ణుడు గణనాథుడిని పూజించినట్టు ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాగే, త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా లంకకు బయల్దేరేముందు గణనాథుడిని పూజించాడని మరో ప్రసిద్ధ నమ్మకం. అలాగే, పాండవుల కాలం కంటే ముందుగానే ఈ ఆలయం ఉందని కొందరు చెబుతుంటారు.

ఉత్తరాలే కాదు.. తొలి ఆహ్వానాలూ పంపుతారు!
తమ సమస్యలకు పరిష్కాల కోసం, కోర్కెలను తీర్చాలని దేశం నలుమూలల నుంచి భక్తులు విఘ్నేశ్వరుడికి ఉత్తరాలు రాస్తుంటారు. అంతేకాకుండా తమ ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యానికీ సంబంధించిన తొలి ఆహ్వానాన్ని స్వామి వారికే పంపుతుంటారు. మంచి ఉద్యోగం కావాలని కొందరు రాస్తే.. ప్రమోషన్లు కావాలని మరికొందరు స్వామివారి పాదాల చెంతకు ప్రతిరోజూ దరఖాస్తులు వస్తుంటాయి.

రాజస్థాన్‌లోని రణథంబోర్‌ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో వెలిశాడు. ఎన్ని కష్టాలు ఉన్నా ఇక్కడి గణపతికి లేఖరాస్తే కటాక్షిస్తాడని భక్తులకు అపార విశ్వాసం. అందుకే తమకు ఏ కష్టం ఎదురైనా నేరుగా స్వామివారికి అడ్రస్‌కు ఉత్తరం రాస్తారు. భక్తులు రాసే ఉత్తరాలను రోజూ ఓ పోస్టుమ్యాన్ స్వామి సన్నిధికి తీసుకురావడం ఈ ఆలయం మరో ప్రత్యేకత. మీరెక్కడున్నా సరే.. ఆలయం అడ్రస్‌ (సవాయ్​ మధోపుర్​ జిల్లా, రణథంబోర్​ గ్రామం, పిన్​కోడ్​ 322021)కి ఓ ఉత్తరం పంపితే చాలంటున్నారు ఆలయ పండితులు.

కరోనా భయం వెంటాడుతుండటంతో ప్రజలు ఈసారి తమ ఇష్టదైవమైన విఘ్నేశ్వురుడి వేడుకలు ఘనంగా జరుపుకోలేకపోయారు. దేశవ్యాప్తంగా ఎక్కడా ఈసారి సందడిలేకుండా పోయింది. అలాగే, రణథంబోర్‌లోని త్రినేత్ర గణపతి ఆలయంలో కూడా అదే పరిస్థితి. ఏటా వినాయక చవితి వస్తే చాలు లక్షలాది మంది భక్తులతో ఎంతో సందడిగా ఉండేది. కానీ ఈసారి కొవిడ్‌ నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఏర్పడటంతో ఆలయానికి మూడు కి.మీల మేర మూసివేశారు. దీంతో భక్తులు స్వామివారి సన్నిధికి వెళ్లలేకపోయినా.. కరోనా కష్టాలనుంచి గట్టెక్కించు స్వామి అంటూ ఉత్తరాలు మాత్రం రాస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement