Advertisement

  • చేతులు కాలకముందే మేల్కొ యువత...రక్తపోటు అనేదే మన దరిచేరకుండా ఏం చేయాలి...?

చేతులు కాలకముందే మేల్కొ యువత...రక్తపోటు అనేదే మన దరిచేరకుండా ఏం చేయాలి...?

By: Anji Sat, 05 Dec 2020 3:28 PM

చేతులు కాలకముందే మేల్కొ యువత...రక్తపోటు అనేదే మన దరిచేరకుండా ఏం చేయాలి...?

ప్రపంచంలో ఏ దేశానికీ లేనంత స్థాయిలో మన దగ్గర యువత సంఖ్య ఉంది. కానీ ఏం లాభం! ఇప్పటి యువత కాస్తా వృద్ధులకంటే నిస్సత్తువతో నిండిపోతున్నారు. రక్తపోటుతో కుంగిపోతున్నారు.

దీని గురించి మనం మనం చెప్పుకోవడం కాదు... ‘హైపర్‌ టెన్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ అధ్యక్షుడు ఎ.మురుగనాధన్‌ చేస్తున్న హెచ్చరికల సారాంశమే ఇది. మురుగనాధన్‌ వంటి నిపుణులు చెబుతున్న కొన్ని గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది.

దేశంతోని 20 యువత రక్తపోటుతో బాధపడుతున్నట్లు ఓ అంచనా! - రక్తపోటు వల్ల 30 ఏళ్ల లోపువారే అనారోగ్యానికి గురవ్వడం, 40 ఏళ్లలోపే చావుకి చేరువ కావడం జరుగుతోంది. - రక్తపోటు, దాంతో పాటు వచ్చే అనారోగ్యాల వల్ల భారతీయ యువత జీవితకాలం దాదాపు 5 శాతం తగ్గిపోతోంది.

మన దేశంలో రక్తపోటు దాదాపు పదిలక్షలకు పైగా చావులకు కారణం అవుతోంది. పైన పేర్కొన్న గణాంకాలని చూసి గుండెలు బాదుకోవల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటికి కారణాలు కూడా అంతే బలీయంగా ఉన్నాయి.

ప్రతిరోజూ ఒత్తిడితో రోజుని మొదలుపెట్టక తప్పని పోటీతత్వం. - ఆ పోటీల్లో నెగ్గుకు వచ్చేందుకు, లక్ష్యాలను ఛేదించేందుకు... చదువు, ఉద్యోగాలలో ఏర్పడుతున్న ఒత్తిడి. - ఆ ఉద్యోగాలలో కూడా ఏసీ గదుల్లో, కదలకుండా, మెదలకుండా గంటల తరబడి కూర్చోవలసి రావడం.

నిరంతరం కూర్చునే ఉంటున్నామని తెలిసినా కూడా శరీరంలో పేరుకుపోయే కొవ్వుని కరిగించే వ్యాయామం చేయకపోవడం. - తినే తిండి, పీల్చే గాలి, చేసే ఆలోచనల్లో స్వచ్ఛత లేకపోవడంతో జీవితమంతా కాలుష్యంతో నిండిపోవడం.

చిరుతిళ్లు... అందులోనూ మన సంప్రదాయబద్ధమైన తిళ్లు కాకుండా చైనీయులవీ, పాశ్చాత్యులవీ తినడం. - ఊబకాయం, గుండె మంట, అజీర్ణం... వంటి సమస్యలు వచ్చినా కూడా తగిన సమయంలో వైద్యులని సంప్రదించడం కానీ, జీవనశైలిని మార్చుకోవడం కానీ చేయకపోవడం.

ఒకవేళ రక్తపోటు ఉందని తెలిసినా కూడా ఎవరికి వారే సోంతవైద్యాలు చేసుకోవడం. - ఉప్పు అధికంగా ఉండే బేకరీ పదార్థాలు, పచ్చళ్లు; తీపి ఎక్కువగా ఉండే పేస్త్రీలు, కూల్‌డ్రింకులు తీసుకోవడం.

చెప్పుకుంటూ పోవాలే కానీ మన జీవనశైలిలో వేస్తున్న తప్పటడుగులు అన్నీ రక్తపోటుకు దారితీసేవే! అందుకనే చేతులు కాలకముందే మేల్కొని జీవనశైలిని మర్చుకుంటే రక్తపోటు అనేదే మన దరిచేరకుండా చూసుకోవచ్చు.

ధ్యానం, వ్యాయామం, మితాహారం, మితభాషణం... ఇవన్నీ ఏవో పెద్దలు చెప్పిన సూక్తులు కావు. రక్తపోటు వంటి రాక్షసుల బారినుండి నిండునూరేళ్లు మనల్ని కాపాడే దీప్తులు. - నిర్జర.

Tags :

Advertisement