ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో దాని వల్ల ఏడుగురు కరోనా బాధితులు మృతి...!
By: Anji Tue, 08 Dec 2020 09:20 AM
ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల ఏడుగురు కరోనా వైరస్ బాధితులు ప్రాణాలు కాల్పోయిన విషాదకర ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. పెషావర్ ఖైబర్ టీచింగ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ఏడుగురు మృతిచెందారు.
ఆదివారం సాయంత్రం ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో.. కొవిడ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఐదుగురు, ఐసీయూలో కోలుకుంటున్న మరొ ఇద్దరు మరణించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉండటం బాధాకరం.
సిలిండర్లు ఖాళీ అయిన ఆక్సిజన్ నిండుకుంటున్నా ఆసుపత్రిలోని ప్లాంటు సిబ్బంది కనీసం పట్టించుకోలేదు. దీంతో రోగులు, వారి బంధువులు ఆసుపత్రిలో వార్డుల చుట్టూ ఉరుకులు పరుగులు పెట్టినా ఫలితం లేకపోయింది.
ఆ సమయంలో ప్లాంట్ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడం, వారికి సరైన శిక్షణ లేకపోవడం, బయో మెడికల్ ఇంజినీర్ విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యమే ఈ సమస్యకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ మొత్తం ఏడుగురు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ‘వాస్తవానికి శనివారం అర్ధరాత్రి నుంచే ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కొక్కటిగా ఖాళీ కావడంతో తీవ్ర విషమంగా ఉండి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందిపడ్డారు..
ఆక్సిజన్ అందకే ఇలా జరుగుతుందని భావించాను.. కానీ, మిగతా రోగులు కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారని’ఓ రోగి బంధువు వెల్లడించారు. తమ బంధువుకి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత సిలిండర్ లభ్యం కావడంతో ఆక్సిజన్ పెట్టారని అన్నాడు.
ఇదిలా ఉండగా.. అధికారికంగా ఆస్పత్రి యాజమాన్యం, ఆరోగ్య మంత్రి తైమూర్ సలీం జాగ్రా విడుదల చేసిన లెక్కల కంటే ఆక్సిజన్ కొరతతో ఎక్కువ మందే చనిపోయారని అక్కడ పనిచేసే కొందరు వైద్యులు అంటున్నారని పేర్కొన్నాడు.
ఆక్సిజన్ కొరతతో రోజూ ఇద్దరు ముగ్గురు రోగులు చనిపోతున్నారని తెలిపాడు. ప్రస్తుతం చనిపోయినవారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని, వీరంతా 50ఏళ్లు దాటినవారేనని అన్నారు.