మహీంద్రా అండ్ మహీంద్రా కే2 సిరీస్ తయారీ తెలంగాణలోనే...!
By: Anji Tue, 17 Nov 2020 7:52 PM
జపాన్‌కు చెందిన మిత్సుబిషీ సహకారంతో కే2 పేరుతో కొత్త రకం ట్రాక్టర్లను తయారు చేయనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ప్రకటించింది. ఈ ట్రాక్టర్లను జహీరాబాద్ కర్మాగారంలో తయారు చేస్తుండడం విశేషం.
మిత్సుబిషి మహీంద్రా వ్యవసాయ యంత్ర సామాగ్రి, మహీంద్రా రీసెర్చ్‌వ్యాలీ ఇంజినీర్ల మధ్య భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన కే2 సిరీస్‌ను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం లైట్ వెయిట్ ట్రాక్టర్ ప్రోగ్రామ్‌ను తయారు చేయడం లక్ష్యంగా చేసుకుని తీర్చిదిద్దినట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణాలో నూతన పెట్టుబడులు పెడుతున్న మహీంద్రాకు ప్రభుత్వం కృతజ్ఞతలను తెలుపుతుంది.
కె2 ట్రాక్టర్లను మిత్సుబిషి సహకారంతో తీర్చిదిద్దడంతో పాటుగా వాటిని జహీరాబాద్‌లోని మహీంద్రా ప్లాంట్‌లో తయారుచేయబోతున్నారు. ఇది మొత్తం దేశానికి అపూర్వమైన గర్వకారణంగా నిలుస్తుంది. తెలంగాణ పెట్టుబడుల కోణంలో చూసినప్పుడు ఇది ప్రతిష్ఠాత్మకమైనది.
మా ప్రస్తుత పెట్టుబడిదారులు గత ఆరేళ్లలో అపూర్వమైన పెట్టుబడులు పెట్టారు. మహీంద్రా పెట్టిన ఈ తాజా పెట్టుబడులు అందుకు ఓ ఉదాహరణగా నిలుస్తాయి.’’ అని అన్నారు.
మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ ‘‘సంఖ్య పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారునిగా మహీంద్రా ఇప్పుడు కే2 సీరిస్‌ను అభివృద్ధి చేయనుండటం పట్ల ఉత్సాహంగా ఉంది.
మా ప్రతిష్టాత్మక ట్రాక్టర్‌లలో ఇది ఒకటి. వైవిధ్యత మరియు వ్యాప్తిపై ఈ ప్రాజెక్ట్ దృష్టి సారించడంతో పాటుగా మా వినియోగదారుల అంచనాలు, విభిన్నమైన ప్రాంతీయ అవసరాలను తీర్చే రీతిలో రూపొందించాం.
మా జహీరాబాద్ సదుపాయానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తుంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గణనీయంగా ఉపాధి అవకాశాలను సైతం అందించగలమని భావిస్తున్నాం’’ అని అన్నారు.
2012లో ఏర్పాటు చేసిన జహీరాబాద్ ఫ్యాక్టరీ సామర్థ్యం పరంగా మహీంద్రాకు అతిపెద్ద తయారీ కేంద్రం. ఇక్కడే కంపెనీ తర్వతి తరపు శ్రేణి యువొ, జివో ట్రాక్టర్లు సహా ఇటీవలే ఆవిష్కరించిన ప్లస్ సిరీస్ ట్రాక్టర్లను సైతం తయారుచేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క ట్రాక్టర్ తయారీదారు మహీంద్రా. జహీరాబాద్ ఫ్యాక్టరీలో దాదాపు రూ.1,087 కోట్లు పెట్టుబడిగా పెట్టింది.
ఫార్మ్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ దాదాపు 1,500 మంది కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటుగా సంవత్సరానికి రెండు షిఫ్ట్‌లలో ఒక లక్ష ట్రాక్టర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది.
జహీరాబాద్ ప్లాంట్ సాంకేతికంగా అత్యాధునికమైనది. 30 నుంచి 100 హెచ్‌పీ వరకూ విభిన్నమైన వేరియంట్లలో 330 విభిన్నమైన ట్రాక్టర్లను తయారుచేసే సామర్థ్యం దీనికి ఉంది.
ఈ ప్లాంట్ టీపీఎం (టోటల్ ప్రొడక్టివ్ మెయిన్‌టెనెన్స్) స్వీకరించడంతో పాటుగా జహీరాబాద్‌లోని ట్రాక్టర్ ఉత్పత్తిలో దాదాపు 65% అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తున్నారు.