భారత మార్కెట్ లో చైనా ఉత్పత్తుల హవా తగ్గలేదు
By: Sankar Thu, 25 June 2020 6:38 PM
గత కొద్దీ కాలంగా చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలి అని దేశం మొత్తం నిరసన జ్వాలలు రగులుతున్నప్పటికీ చైనావస్తువులు తమ హవా కొనసాగిస్తూనే ఉన్నాయి ..చైనాను లేదా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే విషయంలో మెజారిటీ భారతీయులు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేక పోతున్నారు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల కంపెనీ తన ‘వన్‌ప్లస్’ స్మార్ట్‌ఫోన్ల సిరీస్‌లో తీసుకొచ్చిన ‘వన్‌ప్లస్ 8 ప్రో’ మోడల్ ఫోన్లను జూన్ 18వ తేదీన అమెజాన్ ద్వారా భారత్‌లో అమ్మకాలు ప్రారంభించగా క్షణాల్లో అమ్ముడు పోయాయి. అయితే ఎంత సంఖ్యలో, ఎన్ని కోట్లకు అమ్ముడు పోయావో చైనా కంపెనీగానీ, అమెజాన్‌గానీ తెలియజేయలేదు. స్టాక్ అయిపోయినందున బుకింగ్ క్లోజ్ చేసినట్లు అమెజాన్ ప్రకటించింది.
షావోమీ, వీవో, రీల్‌మీ లాంటి చైనా కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు, టీవీలు గత కొన్నేళ్లుగా తెగ అమ్ముడు పోతున్నాయి. చైనా కంపెనీల నుంచి స్మార్ట్ ఫోన్లు, టీవీలు అతి తక్కువ ధరలకు రావడమే కాకుండా నాణ్యత కూడా బాగానే ఉంటుండంతో వాటికి భారత్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దేశంలో ఏటా అమ్ముడుపోతోన్న స్మార్ట్ ఫోన్లలో 76 శాతం ఫోన్లు చైనావేనని సర్వేలు తెలియజేస్తున్నాయి.
ఇటీవల నిర్వహించిన ఓ జాతీయ సర్వేలో ప్రతి పది మందిలో నలుగురు మాత్రమే చైనా ఉత్పత్తులను కొనమని, బహిష్కరిస్తామని చెప్పారు. బహిష్కరిస్తామని చెప్పిన వాళ్లలో కూడా అటు ఇటు ఊగిసలాడే వారు ఉంటారు. ఎందుకు చైనా ఉత్పత్తులను భారతీయులు బహిష్కరించలేక పోతున్నారని ప్రశ్నించగా, భారతీయులు వస్తువుల మన్నికతోపాటు చౌక ధరలను చూస్తారని హాంకాంగ్‌లో పనిచేస్తోన్న సీనియర్ మార్కెటింగ్ విశ్లేషకులు తరుణ్ పాఠక్ తెలియజేశారు.