Advertisement

బుల్‌ స్పీడ్‌- 2 రోజుల్లో 1,428 పాయింట్లు

By: chandrasekar Mon, 28 Sept 2020 9:27 PM

బుల్‌ స్పీడ్‌- 2 రోజుల్లో 1,428 పాయింట్లు


బుల్‌ ట్రేడర్లు కొనుగోళ్ల కొమ్ము విసరడంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. వెరసి ఒక దశలో ప్రామాణిక ఇండెక్స్‌ 600 పాయింట్లకుపైగా దూసుకెళ్లింది. 38,000 పాయింట్ల మార్క్‌ను సైతం సులభంగా దాటేసింది. చివరికి సెన్సెక్స్‌ 593 పాయింట్లు జమ చేసుకుని 37,982 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 177 పాయింట్లు జంప్‌చేసి 11,227 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,036 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,544 పాయింట్ల వద్ద కనిష్టం నమోదైంది. ఇదేవిధంగా నిఫ్టీ 11,239- 11,100 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చూసింది.

వారాంతాన సైతం సెన్సెక్స్‌ 835 పాయింట్లు పెరిగిన సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఓవైపు అమెరికా కాంగ్రెస్‌ ప్రణాళికలు వేస్తుండగా.. మరోవైపు దేశీయంగానూ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు వెలువడిన వార్తలు రెండు రోజుల నుంచీ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ. 20,000 కోట్ల తాజా పెట్టుబడులను సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో వారాంతాన యూఎస్‌ మార్కెట్లు లాభపడగా.. దేశీయంగానూ మార్కెట్లు బుల్‌ దౌడు తీస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు.ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, రియల్టీ 5-3 శాతం మధ్య ఎగశాయి.

ఈ బాటలో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ సైతం 1.7-0.7 శాతం పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, బజాజ్‌ ఫైనాన్స్, యాక్సిస్‌, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ, గ్రాసిమ్‌, ఎంఅండ్‌ఎం, హిందాల్కో, ఎన్‌టీపీసీ, గెయిల్‌, శ్రీ సిమెంట్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌, ఐషర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ 8-3 శాతం మధ్య జంప్‌చేశాయి.

బ్లూచిప్స్‌లో కేవలం విప్రో(0.7 శాతం), హెచ్‌యూఎల్‌(0.5 శాతం) నీరసించాయి.డెరివేటివ్‌ కౌంటర్లలో పీవీఆర్‌ 11 శాతం దూసుకెళ్లగా, ఎస్కార్ట్స్‌, అదానీ ఎంటర్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఐబీ హౌసింగ్‌, అపోలో టైర్‌, బాలకృష్ణ, బంధన్‌ బ్యాంక్‌, టీవీఎస్‌ మోటార్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, భెల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బయోకాన్‌, జిందాల్‌ స్టీల్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, బీఈఎల్‌, నౌకరీ 7.5-5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ విభాగంలో కేవలం టొరంట్‌ ఫార్మా 0.8 శాతం, ఐడియా 0.5 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి.

ట్రేడైన షేర్లలో 1,927 లాభపడగా.. 757 మాత్రమే నష్టాలతో ముగిశాయి.నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,080 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,071 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1,886 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు స్వల్పంగా రూ. 189 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.

Tags :
|
|
|

Advertisement