గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ గా అనిల్ వల్లూరి
By: Sankar Tue, 09 June 2020 11:31 AM
గూగుల్ క్లౌడ్ భారత విభాగ సీనియర్ డైరెక్టర్‌గా అనిల్ వల్లూరి నియమితులయ్యారు. ఇంతక్రితం నెట్‌యాప్ ఇండియా, సార్క్ విభాగ కార్యకలాపాల ప్రెసిడెంట్‌గా సేవలందించారు. ‘‘భారత్‌లోని పలు బహుళజాతి కంపెనీలకు అనిల్ సారథ్యం వహించారు.
మా క్లయింట్ల వ్యాపార, సాంకేతిక సవాళ్లను పరిష్కరించడంలో అనిల్‌కున్న అపార అనుభవం ఎంతగానో ఉపయోగపడనుంది. మా కస్టమర్లతో బంధాన్ని మరింత పటిష్ఠపర్చుకోవడంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాల విస్తరణ, భారత్‌లో కంపెనీల డేటా ఆధారిత ఆవిష్కరణలకు దోహద పడేందుకు అనిల్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’’నని గూగుల్ క్లౌడ్ ఇండియా ఎండీ కరణ్ బజ్వా అన్నారు.
ఆధునిక టెక్నాలజీ సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో అనిల్‌కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. నెట్‌యాప్ కంటే ముందు ఆర్టిమాన్ వెంచర్స్‌లో పనిచేశారు. ఇండియాలో సన్ మైక్రోసిస్టమ్స్ వైస్‌ప్రెసిడెంట్, ఎండీగానూ సేవలందించారు. అనిల్ వల్లూరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్ పట్టా కూడా పొందారు.