జనవరి వరకు 'ఇంటి నుంచే పని' ..అమెజాన్
By: Sankar Thu, 16 July 2020 3:46 PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వలన అన్ని మూతపడ్డాయి ..అయితే కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో ప్రముఖ కంపెనీలు అన్ని వాళ్ళ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని చెప్తున్నాయి ..తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు శుభవార్త అందజేసింది.
కరోనా తీవ్రత తగ్గేవరకు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయవచ్చని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 8 వరకు వర్క్ ఫ్రం హోం చేయవచ్చని తెలిపింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ తమ ఉద్యోగులు ఈ ఏడాది చివరి వరకు ఇంటి నుంచి పనిచేయవచ్చని ఇప్పటికే ప్రకటించాయి.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ వెల్లడించింది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్నికల్పించింది. అక్టోబర్ 2 వరకు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయవచ్చని మే నెలలో తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో తాజాగా గడువును మరో మూడు నెలలు పొడిగించింది. అమెజాన్ సంస్థలో 8.4 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.