Advertisement

  • జలుబు లేకుండానే కరోనా... వాసన, రుచి లేకపోవడం సమస్యేనా?

జలుబు లేకుండానే కరోనా... వాసన, రుచి లేకపోవడం సమస్యేనా?

By: Dimple Thu, 20 Aug 2020 00:11 AM

జలుబు లేకుండానే కరోనా... వాసన, రుచి లేకపోవడం సమస్యేనా?

వాసన తెలియకపోవటం అనేది కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాల్లో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తించింది. అయితే సాధారణ జలుబు, ఫ్లూ జ్వరం వంటివి వచ్చినపుడు కూడా వాసన గ్రహించలేకపోవటం సర్వ సాధారణం. ఈ పరిస్థితుల్లో జలుబుకు, కొవిడ్-19కు గల భేదాలను కనిపెట్టేందుకు బ్రిటన్‌కు చెందిన శాస్త్రజ్ఞులు పరిశోధనలు నిర్వహించారు.

దీనిలో భాగంగా ఒకే వయస్సు, లక్షణాలు, శారీరక స్థితి కలిగిన స్త్రీ-పురుష కొవిడ్‌ బాధితులు, జలుబుతో బాధపడుతున్న వారి లక్షణాలను వీరు నిశితంగా పోల్చి చూశారు. ఈ రెండు సందర్భాలనూ కనిపెట్టే లక్షణాలను గురించి వివరించారు. కొవిడ్‌ వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యలు వైవిధ్యంగా ఉంటాయని, వ్యాధి నిరోధక వ్యవస్థ అతిగా స్పందించే సైటోకైన్‌ స్థితి, నాడీవ్యవస్థపై ప్రభావాలకు కరోనా కారణమౌతుందని వారు వివరించారు. అంతేకాకుండా కరోనా బాధితుల్లో వాసన కోల్పోయే లక్షణం తీవ్ర స్థాయిలో ఉంటుందట. వారు ప్రత్యేకించి చేదు, తీపి వంటి రుచుల్ని పూర్తిగా గుర్తించలేరు. ఇది వారిలో వ్యాధి నిరోధకత దెబ్బ తిన్నదని సూచించే చిహ్నమని పరిశోధకులు అంటున్నారు.
అంతేకాకుండా, సాధారణ జలుబుకు విరుద్ధంగా కరోనా బాధితులకు ప్రారంభ దశలో చక్కగా ఊపిరి ఆడుతుందని, ముక్కు కారడం, దిబ్బడ వేయడం వంటి లక్షణాలు ఉండవని తెలిపారు. దీంతో కొవిడ్‌ మెదడు, నాడీ వ్యవస్థలపై ప్రభావం చూపుతుందనే వాదనలకు బలం చేకూరుతుందని అంటున్నారు. ఈ ఫలితాలు కరోనా రోగులను గుర్తించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయని ఈ పరిశోధనకు సారథ్యం వహించిన యూనివర్సిటీ ఆప్‌ ఈస్ట్‌ ఆంగ్లియా శాస్త్రవేత్త కార్ల్‌ ఫిల్‌పోట్‌ తెలిపారు.

Tags :

Advertisement