Advertisement

పిల్లల ఆహార విషయంలో తీసికోవలసిన జాగ్రత్తలు

By: chandrasekar Mon, 14 Sept 2020 09:23 AM

పిల్లల ఆహార విషయంలో తీసికోవలసిన జాగ్రత్తలు


ఎదిగే పిల్లల ఆహార విషయంలో తీసికోవలసిన జాగ్రత్తలు గురించి చూస్తాం. చిన్నారుల ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఏది తినిపించాలి ఏది వద్దు అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో పెద్దవాళ్లకు కాస్త కంగారుగానే ఉంటుంది. ఒకటిన్నరేండ్లు పైబడిన పిల్లల మొదలు కొత్తగా బడి బాట పట్టిన చిన్నారుల ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. అందుకోసం పోషకాహార నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

నడిచి ఆడుకునే వయస్సు అంటే మూడో ఏడు వచ్చేనాటికి స్వయంగా కలుపుకొని తినే అలవాటు చేయాలి. కొత్తగా బడిలో చేరుతున్న పిల్లలకు లంచ్ బాక్స్ ఎలా తియ్యాలి, ఎలా తినాలి వంటి అంశాల మీద ముందు నుంచే వాళ్లకు చెప్పాలి. పిల్లలు టీవీ చూస్తూ, పేపర్ చదువుతూ భోజనం చేయనివ్వకూడదు. సౌకర్యంగా కూర్చొని, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ భోజనం చేసేలా చూడాలి.

పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించడానికి పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి. కంచంలో వడ్డించిన వంటకాలన్నీ తినాలనే నిబంధన పెట్టటం కంటే ఇష్టమైన వాటినే వడ్డించుకొని తినేలా చూడాలి. పిల్లలకు లాలీపాప్, చాక్లెట్స్ వంటి బరువు పెరిగేవి బహుమతులుగా ఇచ్చేబదులు మరింత ప్రత్యామ్నాయాలు అన్వేషించటం మంచిది.

మార్కెట్లో అందుబాటులో వున్న రెడీమేడ్ ఆహారానికి బదులు పిల్లలకు పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు వంటివి ఇవ్వాలి. పిల్లలకు పాలు, పండ్లు, గింజలతో కూడిన అల్పాహారం రోజూ క్రమంతప్పకుండా అందించాలి. బడి నుంచి ఇంటికి వచ్చాక ఉడికించిన గుడ్డు, గింజలు, ఆమ్లెట్, పల్లీలు, పండ్లు వంటివి చిరుతిండిగా అందించాలి. బరువు పెరుగుతారనే అపోహను పక్కన బెట్టి పిల్లల ఆహారంలో తగినంతగా వెన్న, నెయ్యి వంటివి ఉండేలా చూడాలి.

మంచి పోషణ విలువలున్న ఆహార పదార్థాలను పిల్లలు అందించాలి. వారికి ఆకలి తీరిన మేరకు ఆహారం తీసుకోవటం తప్పనిసరి. రవ్వంత ఒళ్ళు చేస్తున్నారనగానే ఆహారం తగ్గించటం సరికాదు. కొత్త వంటకాలను లంచ్ బాక్స్ లో పెట్టకపోవటమే మంచిది. అలాంటి వంటకాలను డిన్నర్లో వడ్డించి వాటిని ఎలా తినాలో పిల్లలకు వివరిస్తే త్వరగా దానికి అలవాటుపడతారు. పిల్లలు రోజూ 5 నుంచి 8 గ్లాసుల మంచినీరు తాగేలా చూడటంతో బాటు కనీసం 45 నిమిషాలు ఆడుకునేలా చూడాలి. పండ్ల జ్యూస్ లను తరచు ఇస్తూ ఉండాలి.

Tags :

Advertisement