Advertisement

  • నరసరావుపేట పోలీసుల అవినీతి...స్థానికులు ఆవేదన

నరసరావుపేట పోలీసుల అవినీతి...స్థానికులు ఆవేదన

By: chandrasekar Fri, 03 July 2020 10:35 AM

నరసరావుపేట పోలీసుల అవినీతి...స్థానికులు ఆవేదన


కోడి పందేల నుంచి కరోనా లాక్ డౌన్ వరకు, గుట్కా వ్యాపారులు, అక్రమ మద్యం, రేషన్ బియ్యం, ప్రైవేటు సెటిల్మెంట్లు ఇలా దేనిని వదిలి పెట్టకుండా వసూళ్ళపర్వం కొనసాగిస్తున్నారు నరసరావుపేట పోలీసులు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొంతమంది పోలీసుల తీరు మొత్తం పోలీసు వ్యవస్తకే కళంకం తెచ్చే విధంగా తయారయ్యింది.

నరసరావుపేట ప్రాంతానికి చెందిన ఓ ఎస్ఐ కోడి పందేలు నిర్వాహకులతో కుమ్మక్కై లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. గతంలో రూరల్ ఎస్పి గా పనిచేసిన విజయరావు సిబ్బంది అవినీతిపై ఉక్కుపాదం మోపారనే చెప్పొచ్చు.

ఆయన హయాంలో అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నాడని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏళ్ళపాటు పాతుకుపోయిన ఓ ఏఎస్ఐ స్థాయి అధికారిని వీఆర్‌కు పంపడంతో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఐతే రాజకీయ ఒత్తిడిలతో సదరు ఏఎస్ఐ వీఆర్ నుంచి యధాస్థానానికి తిరిగి చేరాడు.పట్టణానికే చెందిన ఓ అధికారి నిషేధిత గుట్కా వ్యాపారి నుండి లక్షల్లో ముడుపులు అందుకుని అతనికి సహకరిస్తున్నాడని, ఆయన స్టేషన్ లో చిన్న చిన్న పనులు కావాలన్నా కూడా చేయి తడవనిదే పనికావడం లేదని అధికారపార్టీ కి చెందిన కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే అదేస్టేషన్ కు చెందిన ఓ ఎస్ఐ లాక్ డౌన్ సమయంలో కిరాణా షాపుల యజమానులను బెదిరించి భారీగా వసూళ్ళకు పాల్పడ్డాడని, సదరు ఎస్ఐ ఆగడాలు భరించలేక వ్యాపారస్తులు అంతా కలిసి స్థానిక శాసనసభ్యునితో మొరపెట్టుకోవడంతో ఆయన మందలింపుతో కొంత వరకు వసూళ్ళు తగ్గించాడని తెలియవచ్చింది.

కొన్ని స్టేషన్లలో అధికారులకు సన్నిహితంగా మెలిగే క్రింది స్థాయి సిబ్బంది బాధితుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళకుండానే స్టేషన్ బయటే సెటిల్మెంట్లు చేసి లక్షల్లో వసూళ్ళకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కొత్తగా బాధ్యతలు తీసుకున్న రూరల్ ఎస్పీ నరసరావుపేట పోలీసుల అక్రమాలపై దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పోలీసు వ్యవస్థ లో మార్పు రాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement