Advertisement

ఇప్పపూవు లడ్డుతో ఆరోగ్యం

By: chandrasekar Fri, 17 July 2020 5:56 PM

ఇప్పపూవు లడ్డుతో ఆరోగ్యం


కరోనా దెబ్బకు ప్రజలకు తులసి, పసుపు, ధనియాలు. ఇప్పటికే నిత్య జీవితంలో భాగం అయ్యాయి. తాజాగా అందరి దృష్టీ ఇప్పపూవు మీద పడింది. ఇప్ప లడ్డూలకోసం ఎగబడుతున్నారు. వీటిలోని అపార పోషక విలువలే ఇందుకు కారణం. ఆదివాసీ గ్రామాల్లో ఇప్పచెట్టును పెర్సపేన్‌ దేవతగా కొలుస్తారు.

గిరిజనులకు ఇప్పపువ్వు లడ్డూలు అంటే చాలా ఇష్టం. ఇప్పలో అనేక పోషకాలు ఉంటాయి. రక్తహీనతను నివారించే శక్తి దీనికి ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో రక్త హీనత ఓ తీవ్ర సమస్య. దాని పరిష్కారానికి

ఆదిలాబాద్‌ జిల్లాలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎక్స్‌రోడ్‌ గ్రామం వద్ద ‘ఆదివాసీ నేచురల్‌ ఫుడ్‌' పేరిట ఓ పరిశ్రమను ఏర్పాటు చేసి, కావాల్సిన పరికరాలను సమకూర్చారు. ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేసి విక్రయించేందుకు ఓ మహిళా సంఘం సభ్యులకు అవకాశం కల్పించారు. తయారీ నుంచి మార్కెటింగ్‌ వరకూ వీరిదే బాధ్యత.

ఓ బృందాన్ని మహారాష్ట్రలోని యావత్‌మాల్‌కు పంపి లడ్డూల తయారీలో శిక్షణ ఇప్పించారు. అనంతరం ఇక్కడి పరిశ్రమలో పనిచేసే అవకాశం కల్పించారు. కిలో రూ. 400 చొప్పున లడ్డూలను విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉత్పత్తిని పెంచి అంగన్‌వాడీలకు, ఆశ్రమ పాఠశాలలకు అందించాలని ఐటీడీఏ అధికారులు భావిస్తున్నారు. ఈ పరిశ్రమ వద్దే జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, జావతో పాటు వివిధ పిండి వంటలతో ఓ హోటల్‌ ఏర్పాటు చేశారు.

లడ్డూలో పోషకాలు అధికం

ఉసిరి, యాపిల్‌ కన్నా ఇదే ఎక్కువ మేలు చేస్తుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇప్పపువ్వు లడ్డూలో పోషకాలు అధికం. దీంతో ఈ లడ్డూకు గిరాకీ పెరిగింది. మరోవైపు ఇప్పచెట్ల పెంపకంపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పటికే 100 ఇప్పచెట్లను నాటాలని సూచిస్తున్నారు. ‘ఇప్పపువ్వు లడ్డూ ఆరోగ్యానికి చాలా మంచిది. అడవిలో దొరికే నాణ్యమైన పదార్థాలతో వీటిని తయారు చేస్తున్నాం. ఇలాంటి రుచులు ఎక్కడా లభించవు. దీన్నో ఉపాధి అవకాశంగా మార్చుకోవాలన్న మా కల నెరవేరింది’ అంటారు ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు బాగుబాయి.

Tags :
|
|
|
|

Advertisement