Advertisement

  • కరోనా ‘సెకండ్ వేవ్’కు కారణం.. తస్మాత్ జాగ్రత్త..!

కరోనా ‘సెకండ్ వేవ్’కు కారణం.. తస్మాత్ జాగ్రత్త..!

By: Anji Thu, 05 Nov 2020 6:49 PM

కరోనా ‘సెకండ్ వేవ్’కు కారణం.. తస్మాత్ జాగ్రత్త..!

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందనే ఆందోళనల తలెత్తిన నేపధ్యంలో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) కీలక ప్రకటన చేసింది.

సెకండ్ వేవ్ అనేది ప్రజలకు ఓ వార్నింగ్ అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. వైరస్‌లో మార్పులు కారణంగా సెకండ్ వేవ్ మొదలు కాదని.. మానవ తప్పిదం వల్లనే దీని ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. సెకండ్ వేవ్ వస్తే కష్టమేనని.. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ప్రస్తుతం ఢిల్లీలో సెకండ్ వేవ్ కొనసాగుతోందని.. గత వారాలతో పోలిస్తే రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయన్నారు. అలాగే ఒడిశాలోని కొన్ని అనుమానాస్పద రీ-ఇన్ఫెక్షన్ శాంపిళ్ళను పరీక్షిస్తే.. అవి ఫాల్స్ పాజిటివ్ కేసులుగా తేలాయి.

కోవిడ్ రీ-ఇన్ఫెక్షన్లు చాలా అరుదుగా సోకుతాయని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని అన్ని చోట్లా కోవిడ్ 19 సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సంభవించే అవకాశాలు ఉన్నాయన్న ఆయన.. కొన్నిసార్లు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందన్నారు.

పండగలు, పెళ్లిళ్లు, గుంపులుగా ఉండే ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని.. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం ద్వారా వేవ్‌లను ఆలస్యం చేయవచ్చునని రాకేశ్ మిశ్రా తెలిపారు.

మరో రెండేళ్ల పాటు ప్రజలు ఈవిధంగానే అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే 60 నుంచి 70 శాతం యాంటీబాడీలు వచ్చి హర్డ్ ఇమ్యూనిటీ లేదా వాక్సిన్ వచ్చేవరకు వేవ్‌లు వస్తూ ఉంటాయన్నారు. వ్యాక్సిన్ల ప్రభావశీలత తేలేందుకు నెలలు కాదు.. ఏళ్ల కొద్దీ సమయం పడుతుందన్నారు.

Tags :

Advertisement