Advertisement

ముఖంపై నల్లమచ్చలు తగ్గుటకు అవసరమైన చిట్కాలు

By: chandrasekar Thu, 02 July 2020 7:48 PM

ముఖంపై నల్లమచ్చలు తగ్గుటకు అవసరమైన చిట్కాలు


నలభై తర్వాత ముఖంపై నల్లమచ్చలు రావడాన్ని మెలాస్మా అంటారు. దీనికి హార్మోన్‌ మార్పులు, ఎండ, థైరాయిడ్‌ సమస్యలు, కొన్ని రకాల టాబ్లెట్లు ఏదైనా కారణం కావచ్చు. మగవాళ్లలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. కాబట్టి, కేవలం హార్మోన్‌ మార్పులే కారణమని చెప్పలేం. ఎండ కూడా మరో ముఖ్యమైన కారకం. ఇది సహజమైన విషయం ఏమీ కాదు. కాకపోతే ప్రమాదకరం కాదు. లోపలేదో సమస్య ఉందని కంగారు పడక్కర్లేదు. కానీ కాస్మెటిక్‌గా మాత్రం సమస్యే.

మగవాళ్లు కూడా దీన్ని కాస్మెటిక్‌ సమస్యగా బాధపడుతుంటారు. పట్టించు కోకుండా వదిలేస్తే సమస్య మరింత పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎండవల్ల ఇది తీవ్రం అవుతుంది. కేవలం ముక్కు, చెంపల మీద ఉండే సమస్య నుదురు,పై పెదవి వైపు కూడా వెళ్తుంది. నల్ల మచ్చల పరిమాణం కూడా పెరుగుతుంది. మిగతా శరీర భాగాల్లో విస్తరిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. వీటి నివారణకు సన్‌స్క్రీన్‌ వాడటం చాలా ముఖ్యం. ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇక సన్‌స్క్రీన్‌ అవసరం లేదని అనుకుంటారు చాలామంది. కాని ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా 30-50 ఎస్‌పిఎఫ్‌ ఉన్న సన్‌స్క్రీన్‌ తప్పనిసరిగా వాడాలి.

ఒకసారి సన్‌స్క్రీన్‌ పెట్టుకున్న నాలుగు గంటల తరువాత మళ్లీ పెట్టుకోవాలి. ఎక్కువ ఎస్‌పిఎఫ్‌ వాడితే మళ్లీ పెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ ఎస్‌పిఎఫ్‌ ఎంత ఉన్నా 100 ఎస్‌పిఎఫ్‌ అయినప్పటికీ నాలుగు గంటలకోసారి సన్‌స్క్రీన్‌ రాసుకోవాల్సిందే. ఉదయం 8 గంటలకు పెట్టుకుంటే మధ్యాహ్నం 12 గంటలకు తప్పనిసరిగా రిపీట్‌ చేయాలి. ఎండాకాలం అయితే 3 గంటలకు మరోసారి పెట్టుకోవాలి. ఈ సన్‌స్క్రీన్‌లలో కూడా బేబీ క్రీమ్‌ లాంటి ఫౌండేషన్‌ బేస్‌ ఉన్నవి వస్తున్నవి. ఇవి ఫౌండేషన్‌ లాగా పనిచేయడమే కాకుండా సన్‌స్క్రీన్‌ ఎఫెక్ట్‌ను కూడా ఇస్తాయి. బయటికి వెళ్లినప్పుడు విడిగా ఫౌండేషన్‌ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.

మీ చర్మ రకాన్ని బట్టి ఏ సన్‌క్రీమ్‌ పెట్టుకోవాలో డాక్టర్‌ చెప్తారు. సన్‌స్క్రీన్‌ వేసుకున్న తరువాత కూడా దానిపైన మేకప్‌కి సంబంధించిన క్రీమ్స్‌ వేయొచ్చు. అవి కూడా రక్షణ పొరగానే ఉపయోగపడుతాయి. బ్లాక్‌ మార్క్స్‌ పోవడానికి కొన్ని క్రీమ్స్‌నూ సూచిస్తాం. ైగ్లెకోలిక్‌ యాసిడ్‌, కోజిక్‌ యాసిడ్‌, హైడ్రోక్వినోన్‌ బేస్‌, రెటినాయిడ్‌ బేస్‌ క్రీమ్‌లుంటాయి. మీ చర్మం రకాన్ని బట్టి క్రీమ్‌లు సిఫార్సు చేస్తారు. ఈ క్రీమ్‌లు రెగ్యులర్‌గా వాడాలి. తగ్గిపోయిందని ఆపేస్తే మళ్లీ రావొచ్చు. మెయింటెనెన్స్‌ ట్రీట్‌మెంట్‌ అవసరం అవుతుంది.

కొందరికి సమస్యను బట్టి విటమిన్‌ సి, ట్రనెక్సిమిక్‌ యాసిడ్‌ లాంటి టాబ్లెట్లు ఇస్తాం. కాని సొంతవైద్యం మాత్రం చేసుకోవద్దు. ఇంకా తగ్గకపోతే కెమికల్‌ పీల్స్‌, లేజర్స్‌ లాంటి చికిత్సలు కూడా ఉన్నాయి. ైగ్లెకోలిక్‌ యాసిడ్‌, ట్రైక్లోరో ఎసిటిక్‌ యాసిడ్‌, ఎల్లోపీల్‌, కాస్మొలాన్‌ పీల్‌ లాంటి పీల్స్‌ కొన్ని సెషన్లలో తీసుకుంటే సమస్య సులువుగా తగ్గుతుంది. ఒకసారి సమస్య తగ్గాక, మెయింటెనెన్స్‌ చికిత్స వాడితే చాలావరకు తగ్గుతుంది. మళ్లీ వస్తే కొన్ని క్రీమ్స్‌, పీల్స్‌ వాడొచ్చు. లేజర్‌ చివరి ఆప్షన్‌గా మాత్రమే ఎంచుకోవాలి. సన్‌స్క్రీన్‌ రెగ్యులర్‌గా వాడుతున్నా, ఏ క్రీమ్‌తో తగ్గట్లేదనుకుంటే, పిగ్మెంట్‌ స్థాయి లోతుగా డెర్మల్‌ మెలాస్మాగా ఉన్నప్పుడు లేజర్‌ టోనింగ్‌ ఇస్తారు.

Tags :
|
|
|

Advertisement