అత్యంత పోషక విలువలున్న జొన్న దోశలు
By: chandrasekar Tue, 29 Sept 2020 07:37 AM
అత్యంత
పోషకవిలువలున్న జొన్న దోశలు చాలా రుచిగా
ఉండడంతో బాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పీచు పదార్థాలు అధికంగా ఉండే జొన్నలు
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత అధికంగా పండే పంట జొన్న. ఎన్నో
ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్నలను డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు. అందుకే
ఇప్పుడు యువత వీటివైపు మొగ్గుచూపుతున్నారు. అన్ని ధాన్యాల కంటే జొన్నలే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.
జొన్నలు మేలైన పోషకాహారం. పాస్పరస్, మాంగనీస్, కాపర్, కాల్షియం, జింక్, పొటాషియం, బీ1, బీ2, బీ3, బీ5 విటమన్లు వంటి రకరకాల పోషకాలు జొన్నల్లో సమృద్దిగా
ఉన్నాయి. సరైన ఆరోగ్యానికి జొన్నలను తరచుగా తీసుకోవడం చాలా అవసరం. జొన్నల్లో పీచు
పదార్థాలు పుష్కలంగా ఉండటంతో జీర్ణకోశానికి మేలు చేస్తాయి. శరీరంలోని చెడు
కొవ్వును నియంత్రిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఎముకలదారుఢ్యాన్ని
మెరుగుపరుస్తాయి. ఇన్ని రకాలుగా మేలు చేసే జొన్నలు ఉపయోగించి దోసెలు ఎలా తాయారు
చేయాలి చూస్తాం.
జొన్న దోశకు కావాల్సిన
పదార్థాలు:
జొన్నలు: రెండున్నర
కప్పులు
బియ్యం: అర కప్పు
మినప్పప్పు: కప్పు
నువ్వుల నూనె: పావు కప్పు
ఉప్పు: తగినంత
జొన్న దోశ తయారు చేసే
విధానం: పదార్థాలన్నిటినీ రాత్రిపూట
విడివిడిగా నానబెట్టుకోవాలి. నానబెట్టిన మినప్పప్పును ముందుగా మెత్తగా రుబ్బుకొని
ఓ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జొన్నలు, బియ్యాన్ని రుబ్బి మినప్పిండిలో వేసుకోవాలి. ఈ పిండి
మరీ గరిటె జారుడుగా లేకుండా చూసుకోవాలి. తగినంత ఉప్పు కలిపి పులవనివ్వాలి. దోశ
వేయడానికి సరిపడా నీళ్లు కలపాలి. పిండిని వేడి పెనం మీద వేసుకోవాలి. చుట్టూ నూనె
వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. దీన్ని కొబ్బరి లేదా అల్లం పచ్చడితో కలిపి
తీసుకోవచ్చు. అందరూ ఇషపడి తింటారు ఈ దోసెలు.