పొట్లకాయతో వెరైటీ స్నాక్ ఐటెం ..పొట్లకాయ రింగ్స్
By: Sankar Wed, 16 Sept 2020 3:29 PM
పొట్లకాయ తీరే వేరు. పొడుగ్గా పెరగడానికి రాయి కడతారు. తిన్నగా సాగాక తనంత పొడవుగా మరొకరు లేరంటూ విర్రవీగుతుంది. పొట్లకాయ అంటే ముఖం చిట్లించక్కర్లేదు. కాస్త చాకచక్యంగా వండాలేగానీ... చవులూరించేలా... తన రుచులు సైతం తనంత పొడవంటూ నిరూపించే పొగరుకాయ పొట్లకాయ...పొట్లకాయతో ఎప్పుడు కర్రీ ఏ కాకుండా వెరైటీగా పొట్లకాయ రింగ్స్ కూడా స్నాక్స్ లాగ తయారు చేసుకోవచ్చు..
కావలసిన పదార్దాలు:
బియ్యప్పిండి – పావు కప్పు
సెనగ పిండి – పావు కప్పు
పసుపు – పావు టీ స్పూను
మిరప కారం – అర టీ స్పూను
కోడి గుడ్డు – 1 (పెద్దది)
ఉప్పు – తగినంత
అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను
పొట్ల కాయ తరుగు – 2 కప్పులు (చక్రాల్లా తరగాలి)
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
1.ఒక పాత్రలో అన్ని పదార్థాలు (నూనె, పొట్లకాయ చక్రాలు మినహా) వేసి బాగా కలపాలి
2. కొద్దిగా నీళ్లు జత చేసి బజ్జీ పిండిలా చేసుకోవాలి
3. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి
4. పొట్ల కాయ చక్రాలను పిండిలో ముంచి, కాగిన నూనెలో వేసి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
5.పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙వేడి వేడి పొట్ల కాయ రింగ్స్‌ను, టొమాటో సాస్‌తో అందించాలి.