రాజ్యసభలో వ్యవసాయ బిల్లుకు మద్దతు తెలిపిన వైస్సార్సీపీ
By: Sankar Sun, 20 Sept 2020 1:01 PM
లోక్‌సభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. ఇవాళ రాజ్యసభలో ఆ బిల్లులను ప్రవేశపెట్టింది.. అయితే, రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందుతాయా? అనే ఉత్కంఠ కొనసాగుతోన్న సమయంలో.. నూతన వ్యవసాయ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... ఈ బిల్లులపై రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. పంటలకు ముందుగానే ధర నిర్ణయించడం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందని.. దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కల్గుతుందని.. మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఇక, ఈ బిల్లులో పొగాకును ఎందుకు చేర్చడం లేదు? అని ప్రశ్నించారు సాయిరెడ్డి.. రైతు ప్రయోజనాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న ఆయన.. “రైతు భరోసా” పేరుతో 49 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. రైతుల కోసం “ధరల స్థిరీకరణ నిధి”ని సీఎం జగన్ ఏర్పాటు చేశారని రాజ్యసభలో ప్రస్తావించిన విజయసాయి.. పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించింది. రైతు భరోసా కేంద్రాలతో విత్తనాలు, ఎరువులు తదితర అన్ని అంశాల్లో సహాయకారిగా ఉంటుందన్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ... కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచనతో వ్యవహరిస్తోందని మండిపడ్డ ఆయన.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మార్కెట్ కమిటీలు రద్దు చేసి, పంటల రవాణాపై ఆంక్షలను తొలగిస్తామని చెప్పిందని.. నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో.. నేడు అదే అధికార పార్టీ చేస్తోందని.. కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు వంచనతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.