రోజురోజుకు పెరిగిపోయే యాగంటి బసవయ్య
By: chandrasekar Thu, 01 Oct 2020 12:03 PM
బనగానపల్లె(కర్నూలు):
యాగంటి క్షేత్ర ఉనికి పురాణకాలం నుంచి ఉందని భక్తుల నమ్మకం. అపర శివభక్తుడైన
భృగుమహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశారని, ఫలితంగా భార్యా సమేతంగా ఇక్కడ శివుడు కొలువైయ్యాడని
ఒక కథనం. అంతేకాక మరో జానపద కథ కూడా ఉంది.
ఇక్కడ పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు
అతడికి పెద్ద పులి కనిపించిందట. ఆ పెద్దపులినే శివుడని
భావించిన చిట్టెప్ప సంతోషంతో ‘నేకంటి నేకంటి ’ అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి
అయ్యిందని అంటారు. ఎర్రమల కొండల్లో ఏకాంతంగా స్వచ్ఛంగా ఉండే ఈ క్షేత్రం
నిరాడంబరంగా తన ఆధ్యాత్మిక కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది. ఏకశిలపై నందిని ఉమామహేశ్వరులు వెలిసిన క్షేత్రం దేశంలో ఇది ఒక్కటే.
కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారు కలియుగాంతానికి ఒక సూచనగా ఈ క్షేత్ర ప్రస్థావన
చేశారు.
రోజురోజుకు పెరిగే యాగంటి
బసవయ్య
యాగంటి క్షేత్రం బసవయ్య
పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం విశేషమైనది. సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే
శివాలయాల్లో శివలింగ దర్శనం అవుతుంది. అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో
కొలువైన్నారు. కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి నందీశ్వరుణ్ణి ఈశాన్యంలో
ప్రతిష్టించారని అంటారు. ఈ నంది రోజు రోజుకూ పెరుగుతోందని భావిస్తున్నారు. తొంభై
ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలు ఉండేదనీ, ఇప్పుడు నంది పెరగడంతో మంటపం స్తంభాలకూ నందికీ మధ్య
ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు. పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది
ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది. కలియుగాంతానికి
ఇది లేచి రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారు.
దర్శన వేళలు
ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1గంట నుంచి 3గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది. ఇక్కడ బస
చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదానం, బ్రహ్మణి రెసిడెన్సీ, టూరిజం,
రెడ్ల, వాసవి ఆర్యవైశ్య, వేదగాయత్రి బ్రాహ్మణ తదితర వసతి గృహాలు ఉన్నాయి.
నిత్యాన్నదాన సౌకర్యం ఉంది.