భీమా డబ్బుకోసం భర్తను చంపించిన భార్య ..
By: Sankar Tue, 23 June 2020 10:44 AM
ఇటీవల భీమా డబ్బుల కోసం సొంత కుటుంభం సభ్యులనే చంపుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి ..తాజాగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది ..భీమా డబ్బుల కోసం కట్టుకున్న భర్తనే చంపేసింది ఓ భార్య ..మరో ఇద్దరితో కలిసి హత్య చేసింది. ఆపై తన భర్త కనిపించడం లేదంటూ అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరికి పోలీసు దర్యాప్తులో పట్టుబడి ఊచలు లెక్కిస్తోంది.
ఈ ఘటన ఈ నెల 19న వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మార్కెట్ సమీపంలో జరిగింది. వరంగల్ రూరల్ అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి కథనం మేరకు.. పర్వతగిరి మండలం హత్యాతండాకు చెందిన బాదావత్ వీరన్న (47), భార్య యాకమ్మ పున్నేలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా స్కూల్ మూసివేయడంతో అందరూ ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో వీరన్న తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. విసుగు చెందిన యాకమ్మ భర్తను కడతేర్చి, అతని పేరిట ఉన్న బీమా డబ్బులను దక్కించుకోవాలని పథకం పన్నింది.
ఇందుకు దగ్గరి బంధువులైన భూక్యా బిచ్య, భూక్యా బుజ్జిలను సంప్రదించింది. వీరన్న పేరిట ఉన్న రూ. 20 లక్షల జీవిత బీమా సొమ్మును 3 భాగాలుగా పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 19న రాత్రి నెక్కొం డ మార్కెట్ సమీపంలో వీరన్నకు మద్యం తాగించి తలపై రాళ్లతో కొట్టి చంపేశారు. పక్కనే ఉన్న కెనాల్ మృతదేహాన్ని పడేసిపోయారు. ఆ మర్నాడు యాకమ్మ తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాలు, ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.