నాపై వర్ణ వివక్ష చూపిన వారు క్షమాపణలు చెప్పాలి ..డారెన్ సామీ
By: Sankar Wed, 10 June 2020 2:03 PM
వెస్టిం డీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ వర్ణ వివక్ష వ్యవహారం ముదురుతోంది. తనపై అలాంటి వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడుతున్నప్పుడు సహచర ఆటగాళ్లు తనను కాలూ (నల్లవాడు) అని పిలిచినట్టు సామీ రెండ్రోజుల క్రితం ఆరోపించాడు. మంగళవారం అతడు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశాడు.
నన్ను అలా పిలిచిందెవరో వాళ్లకు తెలుసు. ఇప్పటికైనా దాని గురించి నాతో మాట్లాడండి.. క్షమాపణ చెప్పండి. వాళ్ల ఫోన్ నెంబర్లు నా వద్ద ఉన్నాయి. వాళ్లు స్పందించకపోతే నేనే బయటపెడతా’ అని సామీ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. మరోవైపు సామీని ఇషాంత్ ‘కాలూ’ అని పిలిచినట్టున్న ఇషాంత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో 2014లో ఇషాంత్ శర్మ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అప్పటి సన్‌రైజర్స్ జట్టు సభ్యులు భువనేశ్వర్, స్టెయిన్‌లతో పాటు సామీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన ఇషాంత్ ‘నేను, భువి, కాలూ, గన్’ అంటూ కాప్షన్ పెట్టాడు. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండడంతో నెటిజన్లు ఇషాంత్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.