ఇంగ్లాండ్ -వెస్ట్ ఇండీస్ సిరీస్ ఇక నుంచి బోథమ్ -రిచర్డ్స్ ట్రోఫీ ..
By: Sankar Fri, 24 July 2020 7:45 PM
భవిష్యత్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య ఎక్కడ టెస్టు సిరీస్ జరిగినా ఇకపై విజేతకు 'రిచర్డ్స్-బోథమ్' ట్రోఫీని అందించనున్నారు. ఇప్పటి వరకు ఇరు జట్లు విజ్డెన్ ట్రోఫీ పేరుతో టెస్టు సిరీస్‌లో తలపడ్డాయి. ఐతే విజ్డెన్ ట్రోఫీ స్థానంలో ఇరు దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్ల పేర్లతో. సరికొత్త ట్రోఫీని ఆవిష్కరించారు. ట్రోఫీ పేరు మార్పునకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ), క్రికెట్ వెస్టిండీస్ బోర్డులు అంగీకరించాయి.
ప్రస్తుత ఇంగ్లాండ్, వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముగింపుతో దశాబ్దాల చరిత్ర గల విజ్డెన్ ట్రోఫీ కనుమరుగవుతుంది. విజ్డెన్ క్రికెటర్ల వందో ఎడిషన్ జ్ఞాపకార్థం 1963లో ట్రోఫీని తొలిసారి ప్రవేశపెట్టారు. ఇకపై ట్రోఫీ లార్డ్స్‌లోని ఎంసీసీ మ్యూజియంలో ఉంచుతారు.
బ్యాటింగ్ దిగ్గజం, విండీస్‌కు చెందిన సర్ వివియన్ రిచర్డ్స్, 121 టెస్టుల్లో 8,540 పరుగులు చేశాడు. అలాగే, ఇంగ్లాండ్ లెజండరీ ఆల్‌రౌండర్ సర్ ఇయాన్ బోథమ్ 102 టెస్టుల్లో 5200 పరుగులు, 383 వికెట్లు పడగొట్టాడు.తమ దేశాల తరఫున అద్వితీయ ప్రదర్శన చేసిన ఈ ఇద్దరు దిగ్గజాల గౌరవార్థం వారి పేర్లతో ట్రోఫీని ఆవిష్కరించారు.