Advertisement

ముదురుతున్న కంగనా , శివసేన వార్

By: Sankar Fri, 04 Sept 2020 9:17 PM

ముదురుతున్న కంగనా , శివసేన వార్


ముంబైను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మాటల యుద్ధం కాస్తా తీవ్ర వివాదంగా మారింది. ఆమె వ్యాఖ్యలపై శివసేన నేతలతో సహా, మహారాష్ట్ర ప్రభుత్వంకూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నువ్వా నేనా అనే విధంగా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టంలేకుంటే ముంబైకు రావాల్సిన అవసరంలేదని ఆమెకు హితవు పలికారు. ముంబై పోలీసులపై విశ్వాసం లేకపోతే నగరంలోకి రావద్దని అన్నారు. అంతేకాకుండా కంగనా ఒక మెంటల్‌ పేషెంట్‌తో పోల్చారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సైతం కంగనా తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. చెడు అభిప్రాయముంటే కంగనా ముంబైకి రావొద్దు అన్నారు.

ఈ క్రమంలోనే కంగనా మరింత ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ నుంచి పార్టీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వ్యాఖ్యలపై కంగనా ఎదురుదాడికి దిగారు. అతన్ని తాలిబన్‌తో పోలుతూ వివాదాన్ని తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టారు. అంతేకాకుండా ‘ఈ నెల 9న ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి. నన్ను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తా’ అంటూ సవాల్‌ విసిరారు.

అయితే కంగనా తాజా వివాదం వెనుక రాజకీయ పార్టీ అండ ఉందని శివసేన నేతలు బహిరంగానే ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ అండదండలతోనే ఆమె ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని సేనలు విమర్శిస్తున్నారు. మరాఠాను కించపరిస్తే ఏమాత్రం సహించమని హెచ్చరిస్తున్నారు.

Tags :
|

Advertisement