చిన్నారులకు మధ్యాహ్న భోజన పథకంలో పాలను కూడా చేర్చాలి ..ఉపరాష్ట్రపతి
By: Sankar Mon, 07 Sept 2020 8:18 PM
చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా వారికి ఉదయం అల్పాహారంలోగానీ, మధ్యాహ్న భోజనంలో గానీ పాలను కూడా చేర్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
సోమవారం కేంద్ర మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో ఫోన్‌లో మాట్లాడిన ఉపరాష్ట్రపతి.. పౌష్టికాహారం అందించే విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి వాకబు చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి.. రాష్ట్రాలన్నింటికి కూడా దీనికి సంబంధించిన సూచనలను పంపిస్తామని తెలిపారు.
అంతకుముందు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అతుల్ చతుర్వేది ఉపరాష్ట్రపతిని కలిశారు. కరోనా నేపథ్యంలో పాడి, పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న చర్యలను పరిష్కరించడంతోపాటు ఈ రంగాన్ని ఆదుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సంఘటిత రంగంలో సహకార సంస్థల ద్వారా పాల సేకరణ గణనీయంగా పెరిగిన విషయాన్ని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు.
సహకార సంఘాలకు నిర్వహణ మూలధన రుణాలపై ఏడాదికి రెండుశాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రైవేటు పాడిపరిశ్రమలకు కూడా అందించాలని ఉపరాష్ట్రపతి సూచించగా.. చతుర్వేది సానుకూలంగా స్పందించారు.