ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పై దుండగుడి దాడి
By: Sankar Sun, 29 Nov 2020 4:19 PM
ఏపీ రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నానికి తృటిలో ప్రమాదం తప్పింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం దుండగుడు మంత్రి కాళ్లకు దండం పెడుతూ పదునైన తాపీతో దాడికి తెగబడ్డాడు. అయితే వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... 'ఈ రోజు అమ్మ పెద్దకర్మ ఉండటంతో పూజాదికాలు పూర్తి చేసుకొని కార్యక్రమానికి వచ్చిన ప్రజలను పలకరిస్తున్నాను. ఇదే క్రమంలో ప్రజలతో మాట్లాడుతూ భోజనాల దగ్గరకు వెళ్తూ.. గేటు దగ్గరకు వెళ్లాను. ఆ సమయంలో ముందు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాళ్ల మీద పడుతున్నట్లుగా ఇనుప వస్తువుతో నా మీద దాడికి ప్రయత్నించాడు.
మొదటి ప్రయత్నంలో నాకు ఎలాంటి గాయం కాలేదు. అది బెల్ట్ బకెల్‌కి తగలడంతో నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. నిందితుడు మరోసారి దాడికి ప్రయత్నించగా అప్రమత్తమైన చుట్టూ ఉన్నవారు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నేను క్షేమంగానే ఉన్నాను ఏమీ జరగలేదు' అని మంత్రి తెలిపారు.