కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
By: Sankar Fri, 18 Dec 2020 2:50 PM
కరోనా వైరస్ వ్యాక్సిన్ తప్పనిసరి కాదు అని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం మేలని చెప్పింది.
గతంలో ఈ వైరస్ బారిన పడ్డారా లేదా అన్నదానితో సంబంధం లేకుండా అందరూ పూర్తి స్థాయి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. దీనివల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పింది. రెండో డోసు తీసుకున్న రెండు వారాల్లోపు శరీరంలో పూర్తిస్థాయిలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయని వెల్లడించింది.
ఇక సమర్థత విషయంలో ఇండియాలో తయారైన వ్యాక్సిన్.. ఇతర దేశాల వ్యాక్సిన్‌లకు ఏమాత్రం తీసిపోవని కూడా తెలిపింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 6 వ్యాక్సిన్‌లు వివిధ ప్రయోగ దశల్లో ఉన్నట్లు తెలిపింది. వ్యాక్సిన్‌లను పూర్తి స్థాయిలో పరీక్షించి, ప్రయోగాలు జరిపిన తర్వాతే అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. క్యాన్సర్, డయాబెటిస్, హైబీపీలతో బాధపడుతున్న వాళ్లు ఈ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకుంటే మేలని ఆరోగ్య శాఖ సూచించింది..