Advertisement

  • విషాదం.. 200 అడుగుల బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల బాలుడు...

విషాదం.. 200 అడుగుల బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల బాలుడు...

By: chandrasekar Thu, 05 Nov 2020 4:10 PM

విషాదం.. 200 అడుగుల బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల బాలుడు...


200 ఫీట్ల బోరుబావి‌లో మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి పడిపోయాడు. అతడి తండ్రే 5 రోజుల కిందట ఆ బోరుబావిని తవ్వించాడు. అందులో పైపులు దించడానికి కూలీలు ఓ వైపు సిద్ధమవుతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నివాడి జిల్లా పృథ్వీపూర్ ప్రాంతంలోని బారాబుజుర్గ్ గ్రామంలో బుధవారం (నవంబర్ 4) ఈ ఘటన చోటు చేసుకుంది. బారాబుజుర్గ్ గ్రామానికి చెందిన హరికిషన్ కుశ్వాహ బుధవారం ఉదయం 9 గంటల సమయంలో తన పొలం వద్ద పనుల్లో ఉండగా అతడి కుమారుడు ప్రహ్లాద్ (3) ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. బాలుడు బోరుబావిలో పడిపోయిన విషయం గుర్తించగానే ఆయన అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 200 ఫీట్ల లోతున్న ఆ బోర్‌వెల్‌లో 100 ఫీట్ల వరకు నీళ్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలుడు 50 నుంచి 60 ఫీట్ల మధ్య చిక్కుకొని ఉన్నట్లు చెబుతున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. బోరుబావిలోకి పరికరాల సాయంతో కెమెరాలను జారవిడిచి పరిశీలించారు. బాధిత బాలుడు తలకిందులుగా ఇరుక్కుపోయి ఉన్నట్లు గుర్తించారు. కొన్ని గంటల పాటు బాలుడి నుంచి సంకేతాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆగిపోయినట్లు చెబుతున్నారు.

సహాయ చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌తో పాటు ఆర్మీ జవాన్లు కూడా పాల్పంచుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఐదారు క్రేన్లు, మూడు బోర్‌వెల్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. బాలుడిని సురక్షితంగా తీసుకొస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. మరోవైపు బాలుడి కోసం అతడి తల్లి తల్లడిల్లుతోంది. ఆమె రోదిస్తున్న తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టిస్తోంది. అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచారం అందించిన వెంటనే స్పందించి ఉంటే తన బిడ్డను కాపాడుకోగలిగేవారమని ఆవేదన వ్యక్తం చేసింది.

Tags :

Advertisement