20 రోజుల్లో భారత్, చైనా మధ్య మూడుసార్లు కాల్పులు
By: chandrasekar Thu, 17 Sept 2020 7:44 PM
భారత్, చైనా
సైనికుల మధ్య గత 20 రోజుల్లో ఇరు దేశాల మధ్య మూడుసార్లు కాల్పుల ఘటనలు
జరిగినట్లు సమాచారం. భారత్, చైనా సైనికుల మధ్య గత 45 ఏండ్లలో ఒక్క బుల్లెట్
కూడా ఫైర్ కాలేదు. తూర్పు లఢక్ సరిహద్దులో ఆగస్టు 29 నుంచి ఈ నెల 8 మధ్య
కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 29-31 మధ్య
పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో
చైనా సైన్యం చొరబాటుకు ప్రయత్నించగా భారత ఆర్మీ అడ్డుకున్నది. ఈ సందర్భంగా
ఇరు దేశాల సైనికులు హెచ్చరించుకుంటూ తొలిసారి గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నెల 7న
ముఖ్పారి కొండ ప్రాంతం వద్ద రెండోసారి కాల్పుల ఘటన జరిగింది.
ఈ నెల 8న
పాంగాంగ్ సరస్సు ఉత్తర తీర ప్రాంతంలో చైనా సైనికులు దూకుడుగా వ్యవహరించడంతో
ఇరువైపులా మూడోసారి సుమారు వంద రౌండ్ల వరకు కాల్పులు జరిగాయి. అయితే ఈ మూడు
కాల్పుల ఘటనల్లో ఎవరికీ ప్రాణ నష్టం జరుగలేదని, ఎవరూ గాయపడలేని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.