జనసేన పార్టీలో జోష్ తగ్గిందని విశాఖలో జోరుగా చర్చ
By: chandrasekar Fri, 18 Sept 2020 6:15 PM
ఏపీలో పవన్ కల్యాణ్ జనసేన
పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీకి ఎంతో క్రేజ్ ఉండేది. అప్పుడు ఆ పార్టీ మీద
ఎంతో మందికి భారీగా అంచనాలు కూడా ఉండేవి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి విజయంలో
జనసేన కీలక పాత్ర వహించిందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఆ
ఎన్నికల్లో జనసేన ఎక్కడా పోటీ చేయకపోయినా ఆ పార్టీ ప్రచారం చేయడం కారణంగానే రాష్ట్రంలో
అధికారంలోకి వచ్చామన్న భావన నాడు టీడీపీ, బీజేపీ నేతల్లో ఉండేది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కల్యాణ్‌కు ఎంతో
గౌరవం, ప్రాధాన్యత
ఇచ్చేవారు. ఇలా ఉన్న పరిస్థితి సార్వత్రిక
ఎన్నికలకు ముందు ఒక్కసారిగా మారింది. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన
పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. టీడీపీ అధికారాన్ని చేజార్చుకోగా జనసేన పార్టీ
ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒక్క అసెంబ్లీ సీటును మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. పవన్
కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోవడం ఆయన అభిమానులను నిరాశ పరిచింది.
అలాగే జనసేన పార్టీపై భారీగా ఉన్న అంచనాలు తలకిందులయ్యాయి.
వైసీపీ అధికారంలోకి
వచ్చాక జరిగిన పలు పరిణామాల క్రమంలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదరలేదు. కానీ, అప్పటినుంచి
జనసేన పార్టీలో జోష్ తగ్గిందని విశాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. పొత్తుకు ముందు
పవన్ కల్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో
విమర్శలు చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన లాంగ్ మార్చ్‌ను విశాఖలో
నిర్వహించారు. అప్పుడు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన
ప్రయత్నాలు జనసేనాని అధిగమించి మరీ లాంగ్ మార్చ్ జరిపారు. జనసైనికుల్లో
ఉత్సాహాన్ని నింపారు. అయితే ఎన్నికల
తర్వాత జనసేనకు చెందిన కొందరు నేతలు పార్టీకి దూరమయ్యారు. విశాఖ లోక్‌సభ స్థానం
నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. ఇలా పార్టీ నేతలు కొందరు
దూరమైనా పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలతో పార్టీ తమ కార్యకలాపాలను
నిర్వహిస్తోంది.