వచ్చే ఏడాది కరోనా రహిత పరిస్థితులలో బతుకమ్మ జరుపుకుందాం ..తెలంగాణ గవర్నర్
By: Sankar Fri, 23 Oct 2020 11:09 PM
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవనంలో భాగమైన ప్రత్యేక పండుగ బతుకమ్మ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
బతుకమ్మ సంబురాలను పురస్కరించుకుని రాజ్‌భవన్ దర్భార్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా ఉద్యోగులకు, పరివార్ మహిళా సభ్యులకు గవర్నర్ స్వయంగా తెచ్చిన చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డలు ప్రకృతితో, పుట్టినగడ్డతో మమేకమయ్యే ఒక విశిష్ఠమైన సందర్భం ఇదన్నారు.
ఆడబిడ్డలు ఇచ్చిపుచ్చుకునే నైవేద్యాలు ఆరోగ్యకరమైనవి, బలవర్థకమైనవన్నారు. వీటి ద్వారా మహిళల్లో పోషకత, ఆరోగ్యం పెంపొందుతాయన్నారు. బతుకమ్మను పేర్చడానికి వాడే పూలలో ఔషద గుణాలుంటాయని వాటి నిమజ్జనం ద్వారా చెరువుల్లోని నీరు శుద్ధి అవుతుందని తెలిపారు.
వచ్చే ఏడాది కొవిడ్ రహిత పరిస్థితుల్లో బతుకమ్మ జరుపుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కె. సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీ శంకర్, సీ.ఎన్. రఘుప్రసాద్, ఇతర అధికారులు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.