రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులపై నేడు సమావేశం..
By: Sankar Tue, 15 Sept 2020 09:35 AM
తెలుగు రాష్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభించేందుకు ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మరోసారి మంగళవారం సమావేశం కానున్నారు. గత నెలలో హైదరాబాద్ బస్‌భవన్‌లో రెండురాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగాయి. రెండురాష్ట్రాలు సమాన దూరం నడుపుకుందామన్న ప్రతిపాదనకు ఏపీ అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన నెలకొన్నది.
తెలంగాణలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన వెయ్యిబస్సులు దాదాపు 2.65 లక్షల కిలోమీటర్ల వరకు నడుస్తుంటే.. ఏపీ పరిధిలో టీఎస్‌ఆర్టీసీకి చెందిన 750 బస్సులు 1.45 లక్షల కిలోమీటర్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము నడుపుతున్న 2.65 కిలోమీటర్లలో 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని.. తెలంగాణ 50వేల కిలోమీటర్ల మేర పెంచుకుంటే రెండురాష్ర్టాలు సమానంగా నడిపినట్టు ఉంటుందని ఏపీ అధికారులు ప్రతిపాదించారు.
ఇందుకు అంగీకరించని టీఎస్ అధికారులు ప్రస్తుతం ఉన్న మేరకే తాము నడుపుతామని.. ఏపీ కూడా అన్ని కిలోమీటర్లే నడుపాలని సూచించినట్టు తెలిసింది. తద్వారా సరిహద్దు పన్నును ఎవరిరాష్ట్రంలో వారు చెల్లించుకుంటే సరిపోతుందని పేర్కొన్నట్టు సమాచారం. దీంతో సర్వీసుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఇరు రాష్ట్రాల రవాణా మంత్రుల భేటీ గత ఆదివారం ఉంటుందని ప్రచారం సాగినా ఎలాంటి సమావేశం జరుగలేదు. అధికారుల మధ్య ఒప్పందం జరిగిన తర్వాతే జరుగనున్నట్లు సమాచారం..