Advertisement

  • అమ్మాయిల వివాహ వయసు పెరిగితే లాభాలు...భారతీయ స్టేట్ బ్యాంక్

అమ్మాయిల వివాహ వయసు పెరిగితే లాభాలు...భారతీయ స్టేట్ బ్యాంక్

By: chandrasekar Fri, 23 Oct 2020 3:27 PM

అమ్మాయిల వివాహ వయసు పెరిగితే లాభాలు...భారతీయ స్టేట్ బ్యాంక్


ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో అమ్మాయిల పెళ్లి వయసును చట్టపరంగా పెంచాలని ఆలోచిస్తున్నారు. అదే జరిగితే చాలా లాభాలు ఉన్నాయని ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ తెలిపింది. అమ్మాయిల వివాహ వయసు పెరిగితే ప్రసూతి మరణాలు తగ్గుతాయని, పోషక స్థాయులు పెరుగుతాయని ఎస్‌బీఐ ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. అలాగే, సమీప భవిష్యత్తులో కళాశాలలకు వెళ్లే అమ్మాయిల సంఖ్య పెరుగుతుందని, దీర్ఘకాలంలో అమ్మాయిలు గొప్ప ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించగలుగుతారని అన్నారు. వివాహ వయసు పెరగడం వల్ల పనిచేసే సామర్థ్యం ఉన్న వారి జనాభా పెరుగుతుందని సౌమ్య ఘోష్ తెలిపారు.

భారత్‌లో సగటు మహిళ వివాహ వయసు 21 ఏళ్లు పైనే ఉంది. అయితే, 35 శాతం మంది అంతకంటే ముందే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ప్రస్తుతం అమ్మాయిల చట్టపరమైన వివాహ వయసు 18 ఏళ్లు. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్) గణాంకాల ప్రకారం 100 మిలియన్ల మందికిపైగా 15 ఏళ్లు కూడా నిండకుండానే మూడు ముళ్లు వేయించుకుంటున్నారు.

దేశంలోని 1.3 బిలియన్ జనాభాలో మహిళల సంఖ్య దాదాపు సగం ఉంది. అయితే, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల నాలుగో వంతు మందిమహిళలు కూడా శ్రమశక్తిలోకి రావడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం అమ్మాయిలకు తగిన పెళ్లి వయసును నిర్ణయించే పనిలో ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం వెలువడనుంది. నాలుగు దశాబ్దాల తర్వాత దేశంలో ఇదే తొలి సవరణ కానుంది. ఫలితంగా చైనా, జపాన్, సింగపూర్ సరసన భారత్ నిలవనుంది. ప్రస్తుతం పురుషుల వివాహ వయసు 21 ఏళ్లు కాగా, అమ్మాయిల వయసును కూడా 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి.

Tags :

Advertisement