ప్రధాని మోడీ ఆస్తి విలువ ఎంతో తెలుసా !
By: Sankar Thu, 15 Oct 2020 9:43 PM
గతేడాదితో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తి విలువ స్వల్పంగా పెరిగింది. జూన్ 30, 2020 నాటికి ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 2.85 కోట్లు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా వెల్లడించారు.
ప్రధాని కార్యాలయానికి ఇటీవల సమర్పించిన నివేదికలో తనకు సంబంధించిన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. వాటి ప్రకారం.. జూన్ నెల ముగిసేనాటికి ప్రధాని మోదీ వద్ద రూ. 31,450 నగదు ఉండగా, ఎస్బీఐ గాంధీనగర్ ఎన్‌ఎస్‌సీ శాఖకు చెందిన ఆయన బ్యాంకు ఖాతాలో 3,38,173 రూపాయలు ఉన్నాయి. ఇక అదే బ్రాంచ్‌లో ఓ ఎఫ్‌డీఆర్ కూడా ఉంది. మల్టీ ఆప్షన్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ. 1,60,28,939 నిల్వ ఉన్నట్లు మోదీ వెల్లడించారు..
అదే విధంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్(ఎన్‌ఎస్‌సీ) విలువ రూ. 8,43,124గా పేర్కొన్నారు. అంతేగాకుండా జీవిత బీమా పాలసీల విలువ రూ. 1,50,597, టాక్స్ సేవింగ్ ఇన్‌ఫ్రా బాండ్ల విలువ రూ. 20 వేలు, వీటితో పాటు చరాస్తుల విలువ 1.75 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. కాగా ఆయనకు ఏ బ్యాంకులోనూ రుణాలు లేవు. అదే విధంగా సొంత వాహనం కూడా లేదు. ప్రధాని మోదీ వద్ద, సుమారు 45 గ్రాముల బరువుగల నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 1.5 లక్షలు.
ఇవేగాకుండా, గాంధీనగర్‌లోని సెక్టార్-1లో తనకు ఓ ప్లాట్ ఉన్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 3,531 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ స్థలంపై ముగ్గురికి సమాన హక్కు ఉందని, ఒక్కొక్కరికి 25 శాతం వాటా ఉందని పేర్కొన్నారు. కాగా సుమారు పద్దెనిమిదేళ్ల క్రితం అంటే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడానికి ముందే ఆయన ఈ స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం. అప్పుడు ఆ ప్లాట్ విలువ 1.3 లక్షల రూపాయలు. ఇక ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం, ప్రధాని మోదీ స్థిరాస్తి విలువ రూ. 1.10 కోట్లు ఉంటుందని అంచనా