పాక్ స్టార్ ఆటగాడు బాబర్ అజాం పై మహిళ సంచలన ఆరోపణలు
By: Sankar Sun, 29 Nov 2020 4:11 PM
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక మహిళ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్ తనను మోసం చేయడమేగాక లైంగికంగా కూడా వేధించాడని తెలిపింది.శనివారం మీడియా సమావేశంలో సదరు మహిళ బాబర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..
బాబర్, నేను స్కూల్ దశ నుంచి మంచి స్నేహితులం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. బాబర్‌కు ఆర్థికంగా కూడా సాయం చేశాను. కాగా 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. కానీ 2012లో అండర్-19 వరల్డ్ కప్‌లో పాక్ టీమ్‌కు బాబర్ నేతృత్వం వహించాడు. దీంతో అతనికి చాలా పేరు వచ్చింది.
ఆ తర్వాత జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాక నన్ను కొట్టి.. శారీరకంగా హింసకు గురిచేశాడు. ఇందుకు సంబంధించి అప్పట్లో బాబర్‌పై పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' అని మహిళ పేర్కొంది.