ఆక్స్‌ఫర్డ్ కరోనా టీకాకు బ్రిటన్ ఆమోదం
By: Sankar Wed, 30 Dec 2020 1:22 PM
కొత్త రకం స్ట్రెయిన్‌తో సతమతం అవుతున్న బ్రిటన్‌కు ఇది ఊరటనిచ్చే వార్త. కరోనా వైరస్ నియంత్రణ కోసం యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన్‌కు బ్రిటన్ ఆమోదం తెలిపింది.
ఇక యూకేలో భారీ స్థాయిలో ఇమ్యూనైజేషన్ ప్రక్రియ కొనసాగనున్నది. కొత్త వేరియంట్‌తో అతలాకుతలం అవుతున్న బ్రిటన్ ఈ టీకాతో మళ్లీ గాడిలోపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్ట్రాజెన్‌కా సంస్థ ఆక్స్‌ఫర్డ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. అయితే సుమారు 10 కోట్ల డోసులను యూకే ఆర్డర్ చేసింది.
5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ మొత్తంలో ప్రొక్యూర్ చేస్తున్నారు. బ్రిటన్‌లో జనజీవితం సాధారణ స్థాయికి వచ్చేందుకు ఈ టీకా ఎంతో ఉపకరిస్తుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కాగా బ్రిటన్‌లో ఇప్పటికే ఆరు లక్షల మందికి టీకాను ఇచ్చేశారు. తొలి టీకాను 90 ఏళ్ల బామ్మ మార్గరేట్ కీనన్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫైజర్ టీకాను ఆమెకు ఇచ్చారు.