పెళ్లయి నాలుగు నెలలు అయినా కాలేదు యువ జంట ఆత్మహత్య
By: Sankar Fri, 14 Aug 2020 11:42 AM
పెళ్లి అయి నాలుగు నెలలు అయినా కాలేదు..ఎన్నో కొత్త ఆశలతో ఇంకా ఎన్నో ఏళ్ళు సాగాల్సిన వారి జీవితానికి అకస్మాత్తుగా ముగింపు పలికారు ..కామారెడ్డి జిల్లాలో యువజంట ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది.
కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన మలావత్ మహేందర్‌కు నాలుగు నెలల కిందట నాగిరెడ్డిపేట మండలం ఎర్రకుంట తండాకు చెందిన శిరీషతో వివాహమైంది. దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగిపోతోంది. కుటుంబ సభ్యులతోనూ కలివిడిగా ఉంటున్నారు. కానీ వారు ఉన్నట్టుండి పోచారం జలాశయంలో శవాలై తేలడం కలకలంరేపింది.
పుట్టింట్లో ఉన్న భార్యను తీసుకొచ్చేందుకు మహేందర్ మంగళవారం ఎర్రకుంట తండాకు వచ్చారు. గోపాల్‌పేటకు వెళ్లి వస్తామని కుటుంబసభ్యులకు చెప్పి ఇద్దరు కలిసి బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఇద్దర్ని వెతికే క్రమంలో జలాశయం గట్టు దగ్గర చెప్పులు, బైక్ చూసి అనుమానం వచ్చి వెతకగా శవాలై కనిపించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. మృతదేహాలను పోస్టుమార్టంకు తీసుకెళ్లారు. యువజంట మరణంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది.