నీట్ పరీక్ష ఫలితాలు విడుదల
By: Sankar Fri, 16 Oct 2020 8:25 PM
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు వెల్లడయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ ntaneet.nic.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
కాగా సెప్టెంబర్ 13 న జరిగిన నీట్ పరీక్షా ఫలితాలు, షెడ్యూల్ ప్రకారం సోమవారం విడుదల కావాల్సి ఉండగా.. సుప్రీం కోర్టు ఆదేశాలతో జాప్యం నెలకొన్న విషయం తెలిసిందే. మహమ్మారి కరోనా కారణంగా, కంటైన్‌మెంట్ జోన్లలో ఉండిపోవడం వల్ల పరీక్ష రాయలేకపోయిన వారికోసం ఈ నెల 14వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. దీంతో నేడు ఫలితాలను విడుదల చేశారు.
ఇక ఈసారి నీట్ ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎయిమ్స్‌లతోపాటు జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్–పుదుచ్చేరిలోనూ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ చట్టం–2019లో సవరణ చేశారు.