చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు ...హెచ్చరించిన మంత్రి కేటీఆర్
By: Sankar Mon, 16 Nov 2020 04:50 AM
హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున పలు కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఔటర్ రింగ్‌రోడ్డులో ఉన్న చెరువులు, నాలాలపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న చెరువులు, నాలలు అన్నింటిపైనా పూర్తిస్థాయిలో అధ్యయనం జరగాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.జిహెచ్ఎంసి కొత్త చట్టాన్ని తీసుకురానున్న క్రమంలో ఆ చట్టంలో వాటర్ బాడీస్ సంరక్షణ కోసం కఠినమైన నిబంధనలను, నియమాలను చేర్చుతామన్నారు.
చెరువులో అక్రమంగా భవనాలు నిర్మిస్తే, ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని కూల్చివేసే అధికారం పురపాలక శాఖకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.