- హోమ్›
- వార్తలు›
- హాథ్రాస్ లో అర్ధరాత్రి అంత్యక్రియలు....భారీ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు తలెత్తే ప్రమాదం
హాథ్రాస్ లో అర్ధరాత్రి అంత్యక్రియలు....భారీ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు తలెత్తే ప్రమాదం
By: chandrasekar Wed, 07 Oct 2020 10:12 AM
హాథ్రాస్ ఘటనలో
బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు జరపడం పై దాఖలు చేసిన పిటిషన్‌ను
సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అర్ధరాత్రి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి గల
కారణాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి వివరించింది.
మరుసటి రోజు భారీ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని
ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి నివేదిక వచ్చిందని
ఆ కారణంగానే తాము అర్ధరాత్రి అంత్యక్రియలను పూర్తి చేయాల్సి వచ్చిందని యూపీ
ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంపై న్యాయస్థానానికి ఓ అఫిడవిట్
సమర్పించింది.
‘సఫ్దార్‌జంగ్ హాస్పిటల్ వద్ద ధర్నా సందర్భంగా చోటు
చేసుకున్న పరిణామాల మాదిరిగానే మరిన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉన్నట్లు
జిల్లా యంత్రాంగానికి సెప్టెంబర్ 29 ఉదయం నిఘా వర్గాల నుంచి నివేదికలు అందాయి.
అంతేకాకుండా ఈ మొత్తం అంశానికి కులం, మతం రంగు పులిమి దాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించే
కుట్ర జరుగుతోందని నివేదికలో తెలిపారు’ అని అఫిడవిట్‌లో తెలిపారు. హాథ్రాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల
దళిత యువతిపై ఉన్నత వర్గాలకు చెందిన నలుగురు యువకులు అత్యాచారం చేసి, తీవ్రంగా
హింసించినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14న
బాధిత యువతి తన తల్లి, సోదరుడితో కలిసి పొలంలో గడ్డి కోయడానికి వెళ్లింది.
కాసేపటి తర్వాత సోదరుడు గడ్డిమోపుతో ఇంటికి తిరిగి వెళ్లిపోగా..
తల్లీకుమార్తెలిద్దరూ దూరం దూరంగా గడ్డి కోస్తున్నారు. కొంత సేపటి తర్వాత తల్లి
వెనక్కి తిరిగి చూడగా తన కూతురు కనిపించలేదు.
ఆందోళనకు గురైన తల్లి..
కుమార్తె కోసం ఆ పరిసరాల్లో గాలించగా కాసేపటి తర్వాత సమీపంలోని గడ్డి పొదల్లో ఓ
చోట ఆ యువతి నగ్నంగా, రక్తపు మడుగులో, తీవ్ర గాయాలతో, నాలుక కొంత భాగం తెగిపోయిన స్థితిలో కనిపించింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అలీఘడ్‌లోని జవహర్ లాల్ మెడికల్ కాలేజ్ అండ్
హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్
హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. ఢిల్లీలో చికిత్స పొందుతూ బాధితురాలు సెప్టెంబర్ 29న ఉదయం
మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని అదే రోజు రాత్రి స్వగ్రామానికి తరలించిన పోలీసులు
అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో అంత్యక్రియలు జరిపారు. కుటుంబ
సభ్యులెవరూ లేకుండానే అంత్యక్రియలు నిర్వహించారని పోలీసులపై ఆరోపణలు వచ్చాయి.
పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఘటనపై
దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి.