Advertisement

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఆ జిల్లాలదే హవా

By: Sankar Fri, 19 June 2020 12:12 PM

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఆ జిల్లాలదే హవాతెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం సాయంత్రం 3 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలను 9.65 లక్షల మంది విద్యార్థులు రాశారు. కాగా, మొదటి ఏడాదిలో 60.4 శాతం, రెండో ఏడాదిలో 68.86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు.

అయితే, ఈ ఫలితాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ చివరి స్థానంలో నిలిచింది. మొత్తం 33 జిల్లాల్లో కెల్లా మెదక్ జిల్లాలో అనుత్తీర్ణులైన వారు ఎక్కువ కావడం గమనించదగ్గ విషయం. మెదక్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పాస్ పర్సంటేజీ 34 శాతం కాగా.. ఇందులో బాలురు 26 శాతం, బాలికలు 41 శాతం పాసయ్యారు. ఇంటర్ రెండో సంవత్సరం పాస్ పర్సంటేజీ 42 శాతం. అందులో బాలికల్లో 49 శాతం, బాలురు 33 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు.

ఇక, గత మార్చిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకూ కొనసాగాయి. మొత్తంగా చూసుకుంటే మొదటి ఏడాదిలో బాలికలు 67 శాతం, బాలురు 52.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో బాలికలు 75.15, బాలురు 62.10 శాతం ఉత్తీర్ణులయ్యారు.

మొదటి సంవత్సరం విద్యార్థులు 4 లక్షల 80 వేల 516 మంది కాగా...60.01 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి, కుమురం భీం జిల్లాలు ఉన్నాయి. రెండో ఏడాదిలో 4,85,323 మంది విద్యార్థులు హాజరు కాగా... 68.86 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ప్రకటించారు. 76 శాతం ఉత్తీర్ణతతో కుమురంభీం జిల్లా తొలి స్థానంలో ఉంది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ రెండో స్థానంలో ఉంది.


Tags :
|

Advertisement