ఊపిరి ఆడక కిందపడిపోయిన వ్యక్తి ..కరోనా భయంతో దగ్గరకు వెళ్లని జనం ..
By: Sankar Fri, 17 July 2020 7:11 PM
కరోనా వచ్చిన నాటి నుంచి మనుషుల్లో మానవత్వం, సాటివారి పట్ల జాలి, దయ తగ్గుతున్నాయి. మాస్క్ మాటున మనిషితనం కూడా మాయమవుతోంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు ప్రతి రోజు ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో చోటు చేసుకుంది.
బస్సు దిగి బయటకు వస్తూ ఓ 55 ఏళ్ల వ్యక్తి కింద పడిపోయాడు. శ్వాస ఆడక గిలగిలా కొట్టుకున్నాడు. అయితే కరోనా భయంతో చూట్టూ ఉన్నా జనాలు చూస్తూ ఉన్నారు తప్ప దగ్గరకు వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. సుమారు గంట పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ వ్యక్తిని ఆర్టీసీ అధికారుల చొరవతో 108 అంబులెన్సులో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రెండు గంటల తర్వాత మృతి చెందాడు..
మరణించిన వ్యక్తిని మెదక్ జిల్లా బూరుగుపల్లి గ్రామానికి చెందిన హన్మంతుగా గుర్తించారు. తొమ్మిది నెలల కిందట ముంబై నుంచి కూతురి ఇంటికి వచ్చాడు. అయితే ఉపాధి లేకపోవడమే కాక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తిరిగి ముంబై వెళ్లాలని భావించాడు. ఈ క్రమంలో కామారెడ్డి బస్టాండ్‌కు వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.