ఏటీఎంలో పక్కన పడి ఉన్న 50వేల కట్ట...నిజాయితీగా పోలీస్ స్టేషన్ లో అప్పగించిన వ్యక్తి
By: Sankar Fri, 06 Nov 2020 08:27 AM
ఏటీఎంలో తనకు దొరికిన నగదును పోలీసులకు తెచ్చి ఇచ్చి ఓ చిరుద్యోగి తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
సీఐ నర్సింహారెడ్డి కథనం ప్రకారం.. నిజాంపేటకు చెందిన సింహాద్రి రామకృష్ణ ఓ ప్రైవేట్ ఉద్యోగి. తన సోదరి వైద్యఖర్చుల నిమిత్తం నగదు డ్రా చేసేందుకు కరూర్‌వైశ్యాబ్యాంకు ఏటీఎం వెళ్లాడు. అయితే అంతకు ముందే బ్యాంకు ఏటీఎం మనీ లోడింగ్ టీంలో పనిచేస్తున్న (రైటర్‌సేఫ్‌గార్డ్) రవికుమార్ సదరు ఏటీంలో మనిలోడింగ్ చేస్తుండగా అతడికి తెలియకుండా రూ. 50వేల కట్ట (500వందల నోట్లు) పక్కకు పడిపోయాయి.
అనంతరం డబ్బుల డ్రా చేసుకునేందుకు వెళ్లిన రామకృష్ణకు ఆ డబ్బులు కనిపించటంతో వాటిని నేరుగా బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. కేసు విచారణలో నగదు పక్కకు దొర్లినట్లు తేల్చారు. బ్యాంకు అధికారులతో కలిసి నిజాయితీని చాటుకున్న రామకృష్ణను గురువారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో శాలువాతో సత్కరించారు. బాచుపల్లి సీఐ నర్సింహారెడ్డి, కరూర్ వైశ్యాబ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.