భారత్ బంద్‌కు మద్దతిస్తున్నామన్న మమతా బెనర్జీ
By: chandrasekar Tue, 08 Dec 2020 08:45 AM
దేశంలో రైతులు
కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్
బంద్ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు ట్విస్ట్ ఇచ్చారు.
రైతు చట్టాలకు సంబంధించి ఆమె మాట మార్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు
భారత్ బంద్ జరగనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పార్టీలు బంద్‌కు మద్దతు
ప్రకటించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ సంఖ్యలో చేరుకున్న రైతులు గత 11
రోజులుగా సమ్మె చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు.
వ్యవసాయచట్టాల్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌పైనే రైతులింకా పట్టుబడుతున్నారు.
ఈ నేపధ్యంలో ఈరోజు జరగనున్న భారత్ బంద్ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
మొదట్లో బంద్‌కు మద్దతివ్వమని చెప్పారు. అయితే తాము రైతుల పక్షానే ఉంటామన్నారు.
ఇంతకుమునుపు
చెప్పినదానికి వ్యతిరేకంగా ఇప్పుడు మమతా
బెనర్జీ మరో ట్విస్ట్ ఇచ్చారు. రైతు చట్టాల్ని వెనక్కి తీసుకోవాలని ఈ రోజు జరగబోయే భారత్ బంద్‌కు మద్దతిస్తున్నామని
స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు మమతా బెనర్జీ. బీజేపీ తన
తుపాకులకు శిక్షణ ఇచ్చి పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చేందుకు
ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని
మండిపడ్డారు. బెంగాల్ ప్రభుత్వం అల్లర్లను అనుమతించదనే విషయం గుర్తుంచుకోవాలని
చెప్పారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డబ్బు సంచీలతో
ప్రభుత్వాల్ని కూల్చాలని చూసే బీజేపీ లాంటి పార్టీ తమది కాదని మమతా స్పష్టం
చేశారు. నిప్పుతో ఆటలాడవద్దని హితవు పలికారు. గాంధీ హంతకులకు పశ్చిమ బెంగాల్
ఎన్నటికీ తలవంచదన్నారు. రాష్ట్రంలో హిందూ ముస్లిం, ఇతర వర్గాల మధ్య చీలిక
సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంపై
తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.