ప్రణబ్ దాదా నన్ను తండ్రిలా ఆదరించారు ..మమతా బెనర్జీ
By: Sankar Mon, 31 Aug 2020 8:22 PM
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మనల్ని వీడి వెళ్లడం బాధాకరమని, ఆయన మరణంతో ఓ శకం ముగిసిందని అన్నారు. దశాబ్ధాలుగా ప్రణబ్ ముఖర్జీ తనను తండ్రి మాదిరిగా ఆదరించారని చెప్పారు. ఎంపీగా తాను తొలిసారి గెలిచినప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీ తన సీనియర్ కేబినెట్ సహచరుడిగా ఆపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అయ్యేవరకూ ఆయనతో అనుబంధం మరువలేనిదని మమతా పేర్కొన్నారు.
దివంగత నేతతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని, ప్రణబ్ దాదా లేకుండా ఢిల్లీ పర్యటన ఊహించలేనిదని వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకూ అన్ని అంశాల్లోనూ ఆయన లెజెండ్ అని కొనియాడారు. ప్రణబ్ లేని లోటు పూడ్చలేనిదని ఆయన కుమారుడు అభిజిత్, కుమార్తె శర్మిష్ట ముఖర్జీలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇక తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. అందరికీ వందనం అంటూ ట్వీట్‌ను ప్రారంభించిన శర్మిష్ట ‘నాన్నా..అందరికీ మీ తుది వీడ్కోలు పలికేందుకు మీ అభిమాన కవి కోట్‌ను ఉదహరించే స్వేచ్ఛ తీసుకుంటున్నాను..దేశ సేవలో, ప్రజా సేవలో మీరు పూర్తిగా, అర్ధవంతమైన జీవితం గడిపారు..మీ కుమార్తెగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తా’ అని వ్యాఖ్యానించారు.