Advertisement

ప్రాణం మీదకు తెచ్చిన లూడో ఆట ..

By: Sankar Tue, 30 June 2020 7:46 PM

ప్రాణం మీదకు తెచ్చిన లూడో ఆట ..



కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో బయటకు కూడా వెళ్ళడానికి లేకపోవడంతో ఎం చేయాలో తెలియక ప్రజలు ఆన్లైన్లో గేమ్స్ ఆడటం మొదలు పెట్టారు ..లాక్ డౌన్ సమయంలో సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఆడిన గేమ్ లూడో ..అష్ట చెమ్మ ను పోలి ఉండే ఆటను పెద్దలు , పిల్లలు ఎవరైనా ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది ..అయితే ఇపుడు ఆ లూడో ఆట ఒక వ్యక్తికి ప్రాణం మీదకు తెచ్చింది ..

మద్యంమత్తులో ఆటాడుతున్న ఇద్దరు యువకుల మధ్య బెట్టింగ్ వ్యవహారంలో వివాదం తలెత్తింది. బెట్టింగ్ పెట్టే దమ్ము లేదంటూ తూలనాడడంతో కోపంతో రగిలిపోయిన ఎదుటి వ్యక్తి మద్యం సీసా పగలగొట్టి పొడిచేయడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్‌లో జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో కోలా గోపి, వట్టికొండ నాగేశ్వరావు అనే ఇద్దరు యువకులు పక్కపక్కనే కూర్చొని మద్యం తాగుతూ సెల్‌ఫోన్లో లూడో గేమ్ ఆడుతున్నారు. మొదటగా రూ.50 బెట్టింగ్ పెట్టి ఆడారు. వరుసగా రెండుసార్లు నాగేశ్వరరావు గెలవడంతో గోపి అసహనానికి గురయ్యాడు.

ఈ సారి బెట్టింగ్ రూ.500 పెడదామని గోపి అనగానే.. నీకంత దమ్ములేదంటూ నాగేశ్వరరావు తూలనాడాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న గోపి పక్కనే ఉన్న మద్యం సీసా పగలగొట్టి నాగేశ్వరావుపై దాడి చేశాడు. మెడ, పొత్తికడుపులో విచక్షణా రహితంగా పొడిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :
|
|

Advertisement