ముఖేష్ అంబానీ జీయో 5జీ నెట్వర్క్ పై కీలక ప్రకటన....
By: chandrasekar Tue, 08 Dec 2020 7:26 PM
ప్రపంచాన్ని
నడిపించడానికి డిజిటల్ పారిశ్రామిక విప్లవంలో రిలయెన్స్ సిద్ధంగా ఉందని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్
మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ అన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020
సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఇతర
ప్రముఖులను ఉద్దేశించి ముఖేష్ అంబానీ ఈ విధంగా మాట్లాడారు. భారతదేశ డిజిటల్
విప్లవం గురించి మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి కాలంలో భారతదేశం నిలబడటానికి, ముందడుగు
వేయడానికి దేశంలోని బలమైన 4జీ నెట్వర్క్ ఎలా ఉపయోగపడిందో తెలిపారు. భారతదేశంలో
ఆర్థిక వ్యవస్థ ఎలా వృద్ధి చెందుతుందో వివరించడంతో పాటు డిజిటల్ రంగంలో ముందంజలో
ఉండటానికి కావాల్సిన నాలుగు ఐడియాలను ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు.
"ప్రస్తుతం భారతదేశంలో 30 కోట్ల మొబైల్ సబ్‌స్క్రైబర్లు ఇప్పటికీ 2జీ
యుగంలో చిక్కుకు పోయారు. నిరుపేదలు సైతం సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించేందుకు
కావాల్సిన విధానపరమైన చర్యల్ని వెంటనే తీసుకోవాలి. వాళ్లు కూడా తమ బ్యాంక్
అకౌంట్లకు ప్రత్యక్ష నగదు బదిలీ పొందగలరు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో చురుగ్గా
పాల్గొంటారు" అని తన మొదటి ప్లాన్ ను తెలిపారు.
డిజిటల్‌గా భారతదేశం
ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వీలైనంత త్వరగా 5జీ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చేలా విధానపరమైన
చర్యల్ని తీసుకోవడం అవసరం. దీంతో పాటు సరసమైన ధరకు, అన్ని ప్రాంతాల్లో 5జీ
నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురావాలి. 2021 రెండో అర్థభాగం నాటికి 5జీ
విప్లవంలో జియో మార్గదర్శకంగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాను. స్వదేశంలో అభివృద్ధి
చేసిన నెట్వర్క్, హార్డ్‌వేర్, టెక్నాలజీతో ఇది సాధ్యమవుతుంది. మీ విజన్ అయిన
ఆత్మనిర్భర్ భారత్‌కు జియో 5జీ సర్వీస్ సాక్ష్యంగా ఉంటుంది అని అన్నారు. ఇక జియో ప్లాట్‌ఫామ్స్ గురించి
మాట్లాడుతూ.. భారతదేశ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆశయాలకు తమ ప్రయత్నం మద్దతుగా
ఉంటుందన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, మౌలిక సదుపాయాల, ఆర్థిక సేవల, సరికొత్త వాణిజ్యం లాంటి రంగాల్లో వినూత్నమైన
టెక్నాలజీ సేవల్ని జియో ప్లాట్‌ఫామ్స్ ఎలా అందిస్తుందో వివరించారు. "20
స్టార్టప్ పార్ట్‌నర్స్‌తో జియో ప్లాట్‌ఫామ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్
కంప్యూటింగ్, బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్‌లో ప్రపంచ
స్థాయి సామర్థ్యాలను సృష్టించింది" అని అన్నారు. అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు
భారతదేశంలో అడుగుపెట్టి, వారి హార్డ్‌వేర్ తయారు చేసేందుకు కేంద్ర మంత్రి
రవిశంకర్ ప్రసాద్ చేస్తున్న కృషిని గుర్తు చేశారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను
బలోపేతం చేయడానికి, పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. భారతదేశం ఇతర
దేశాల నుండి పెద్ద ఎత్తున దిగుమతులపై ఆధారపడకూడదన్నారు. సెమీకండక్టర్ ఫాబ్రికేషన్
పరిశ్రమగా భారతదేశ సామర్థ్యాన్ని గుర్తు చేశారు. "ఈ రంగానికి చెందినవారంతా కలిసి
పనిచేస్తే, హార్డ్‌వేర్ రంగంలో భారతదేశం విజయం తథ్యం. సాఫ్ట్‌వేర్‌లో
మనం సాధించిన విజయాలతో సమానంగా హార్డ్‌వేర్‌లో విజయం సాధించొచ్చు" అని
వివరించారు ముఖేష్ అంబానీ.