కాశ్మీర్ జనాభాలో వైరస్ ను తట్టుకునే శక్తి కేవలం రెండు శాతం మాత్రమే ..ఐసీఎంఆర్
By: Sankar Sun, 14 June 2020 2:59 PM
ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలతో కశ్మీరీల జీవితం నరకప్రాయం కాగా తాజాగా కనిపించని శత్రువు కరోనా మహమ్మారి వారిపై పంజా విసురుతోంది. 98 శాతం మంది కశ్మీరీలు కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని, వైరస్‌ను అడ్డుకునే యాంటీబాడీలు కేవలం 2 శాతం జనాభాలోనే అభివృద్ధి చెందుతున్నాయని ఐసీఎంఆర్ ఇటీవల చేపట్టిన సర్వేలో వెల్లడైంది.
400 రక్త నమూనాలను పరిశీలించిన ఈ సర్వేలో కరోనా వైరస్‌తో పోరాడగల యాంటీ బాడీల ఉనికి కేవలం 8 శాతం మందిలోనే గుర్తించారు. దేశవ్యాప్తంగా 82 జిల్లాల్లో ఐసీఎంఆర్ నిర్వహించిన ఈ సర్వేలో వ్యాధి నిరోధక శక్తి కలిగిన జనాభా కేవలం 0.73 శాతమేనని తేల్చింది. ఇక కశ్మీరీల్లో వైరస్‌ను తట్టుకోగలిగే హెర్డ్ ఇమ్యూనిటీ దశ చాలా దూరంలో ఉందని నిపుణులు పేర్కొంది.
మేలో కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఐసీఎంఆర్ చేపట్టిన సెరో సర్వేలో కేవలం రెండు శాతం మంది రక్తంలోనే యాంటీబాడీలు ఉన్నాయని వెల్లడైందని నిపుణులు తెలిపారు. ఇటీవల ఎవరైనా వైరస్ బారిన పడి కోలుకుని ఉంటే వారు వైరస్‌లను ఎదర్కొనే యాంటీబాడీలను కలిగిఉంటారని డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ కశ్మీర్ ప్రెసిడెంట్ డాక్టర్ నిసారుల్ హసన్ పేర్కొన్నారు.
ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయటపెడితే వైరస్ బారినపడతారని, ఆ తర్వాత కోలుకుని వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. వైరస్ స్వభావంలో మార్పు చెందితే అది భిన్నంగా ప్రవరిస్తూ మరిన్ని మరణాలు సంభవించవచ్చని, దాంతీ ఇప్పటివరకూ మనం తీసుకున్న చర్యలన్నీ వృధా అవుతాయని హెచ్చరించారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లను ధరిస్తూ తరచూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారు.