సీఎం జిల్లా జైలులో 19 మందికి కరోనా పాజిటివ్
By: Sankar Wed, 12 Aug 2020 2:03 PM
కడప సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జైళ్ల శాఖ డీఐజీ ఎం వరప్రసాద్ వెల్లడించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో ఉంచామన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కొవిడ్ ఆస్పత్రులకు తరలించలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు.
కరోనా బాధితులందరికీ పాలు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్లు అందుబాటులో ఉండి కరోనా సోకిన ఖైదీలను పరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న మొత్తం 700 మంది ఖైదీలకు కరోనా టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. అయితే కొంతమంది ఖైదీలు.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుల్లో పని చేస్తున్నారు. కరోనా సోకిన బయటి వ్యక్తుల నుంచి వారికి కరోనా వ్యాప్తి చెందినట్లు నిర్ధారించారు.
కడప జిల్లాలో ఇప్పటి వరకు 14,640 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 8,955 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. కాగా ఇటీవలే రాజమండ్రి సెంట్రల్ జైలు లో కూడా అనేక మంది ఖైదీలు కరోనా బారిన విషయం తెలిసిందే..అయితే ఇపుడు కడప జైలులో కూడా కరోనా కేసులు వెలుగు చూడటంతో ఏపీ యంత్రంగం అప్రమత్తం అయింది