అమిత్ షాతో జగన్ భేటీ మూడు రాజధానుల విషయమే...
By: chandrasekar Wed, 16 Dec 2020 10:56 PM
ఆకస్మిక౦గా ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు కారణ౦ ఏంటి అని రకరకాల వార్తలు వచ్చాయి. మూడు రాజధానుల
అంశమే పర్యటనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏపీలో మూడు రాజధానుల అంశం ప్రతిపాదనకు
కేంద్రమద్దతు కోరారు. ముఖ్యంగా న్యాయ రాజధానిగా ప్రతిపాదించిన కర్నూలులో హైకోర్టు
ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయాలని అమిత్
షాను కోరారు. మూడు రాజధానుల ప్రతిపాదన అవసరం, శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా
రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఎంపిక వెనుక కారణాల్ని
హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ జగన్ వివరించారు.
దాదాపు గంట సేపు కేంద్ర
హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన జగన్ పలు కీలకాంశాలపై చర్చించారు. మూడు
రాజధానుల అంశం మరోసారి చర్చనీయాంశమవడంతో తొలిసారిగా ఈ అంశంపై కేంద్ర మద్దతు కోరారు
వైెఎస్ జగన్. ఇందులో భాగంగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన రీ లొకేషన్
నోటిఫికేషన్ జారీ చేయాలని అడిగారు.
పోలవరంపై సవరించిన 55 వేల 656 కోట్ల అంచనాల్ని ఆమోదించాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు
సంబంధించి రాష్ట్రానికి రావల్సిన 15 వేల కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాలయాపన జరిగేకొద్దీ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిపోతుందని గుర్తు చేశారు.
రాష్ట్ర రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనంటూ కేంద్రం
హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లను ఈ సందర్బంగా వైఎస్ జగన్ ప్రస్తావించారని
తెలుస్తోంది. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా హైకోర్టుపై నోటిఫికేషన్ ఇస్తే
పనులు త్వరగా ప్రారంభిస్తామన్నారు.