మేము ఒక్కరమే కరోనా మీద పోరాడితే విఫలం అయ్యేవాళ్ళము ..అరవింద్ కేజ్రీవాల్
By: Sankar Wed, 15 July 2020 7:08 PM
భారత్‌లో కరోనా విజృంభిస్తుంది. అత్యధిక కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. అయితే గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో సహకారం అందించిన కేంద్రం సహా అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కృతజ్ఞతలు తెలిపారు.
బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'కోవిడ్‌పై కేవలం ఢిల్లీ ప్రభుత్వమే ఒంటరిగా యుద్ధం చేసుంటే విఫలమై ఉండేది. అందుకే కేంద్రప్రభుత్వం, ఎన్జీఓలు, వివిధ సంస్థలతో కలిసి పనిచేశాం అందరి సహకారం తీసుకున్నాం. దానికనుగుణంగానే ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి' అని సీఎం పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 29,429 కేసులు నమోదైతే ఢిల్లీలో కేవలం 350 కేసులే నమోదుకావడం గమనార్హం..
ఢిల్లీలో వైరస్ చూసి జూలై 15 నాటికి రాష్ట్రములో రెండున్నర లక్షలకు పైగా కరోనా కేసులు పెరుగుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 1.15 లక్షలుగానే ఉంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని దీనికి వివిధ పార్టీ నేతలతో పాటు ప్రజల సహకారం ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
యాంటిజెన్ టెస్టింగ్ విధానం మొట్టమొదట ఢిల్లీలోనే ప్రారంభమైందని దీనికి కేంద్రం సంపూర్ణ మద్దతిచ్చిందని తెలిపారు. రోజుకు 20 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. అంతేకాకుండా ఐసీయూలు, పడకల సామర్థ్యాన్ని మరింత పెంచామని, ప్రస్తుతం ఏ ఆసుపత్రిలోనూ బెడ్స్ కొరత లేదని వెల్లడించారు. జూన్ 1న ఢిల్లీలో కేవలం 4,100 పడకలు ఉండగా ప్రస్తుతం దాని సామర్థ్యం 15,500కు పెరిగిందని తెలిపారు..